తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలన్ని వచ్చే ఎన్నికల్లో విజయం కోసం అస్త్రశస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి. అందులో భాగంగానే కుల సమీకరణలపై పార్టీలన్నీ ఫోకస్ పెంచాయి. ఒకవైపు కమలం, మరోవైపు గులాబీ పార్టీలు బీసీ నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. అసలు ఇంతకు రాజకీయ పార్టీలు బీసీ స్లోగన్ ఇప్పుడు ఎందుకు ఎత్తుకున్నాయి? ముఖ్యంగా గులాబీ పార్టీలో బీసీ నినాదం ఏ మేరకు వర్కవుటు అవుతుంది?
తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ విజయం సాధించాలన్నా బీసీ సామాజిక వర్గాల మద్దతు కీలకం. దాదాపు 50 శాతానికి పైగా బీసీ సామాజిక వర్గం తెలంగాణలో వుంది. అందుకే బీసీ ఓటర్ల మద్దతు కోసం పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పెద్దగా లబ్ది చేకూరింది ఏమి లేదని, ఎన్నికల్లో తమకు అధికారం ఇస్తే మేలు చేస్తామని నేతలు ఢంకా బజాయిస్తున్నారు. బీఆర్ఎస్ బీసీల ఓట్లు చేజారిపోకుండా అలెర్ట్ అయింది. కోదాడ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీ మంత్ర పఠించారు. సూర్యాపేట సభలో అమిత్షా స్వయంగా ప్రకటించిన బీసీ సీఎం కామెంట్లకు కౌంటర్ ఇచ్చినంత పని చేశారు.
తెలంగాణలో ఎన్నికల సమయం కాబట్టే బీసీ సామాజిక వర్గంపై దృష్టి సారించాయి ప్రధాన పార్టీలు. బీసీ ఓట్లను గంపగుత్తగా సాధిస్తే రాష్ట్రంలో అధికారం పొందడం నల్లేరు మీద నడకే అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, కమలం పార్టీలు ఎత్తుకున్న బీసీ నినాదం ఏ మేరకు సక్సెస్ అవుతుందో ఎన్నికలే తేల్చబోతున్నాయి.