భాగ్యనగర ప్రజలకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన మరో 13 వార్డు ఆఫీస్‌లను బుధవారం ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి గతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న వివిధ శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, వార్డు ఆఫీసుల ఏర్పాటుతో జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు వార్డు కార్యాలయంలోనే అందుబాటులో ఉంటారన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 150 డివిజన్‌లలో ఒక్కో డివిజన్‌కు ఒక్కో వార్డు ఆఫీస్ చొప్పున 150 ఆఫీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించి ఇప్పటికే 137 ఆఫీసులను మంత్రులు, మేయర్, ఇతర ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు.
సనత్‌నగర్‌లోని రాంగోపాల్ పేట, ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని భోలక్‌పూర్, అంబర్‌పేటలోని తిలక్‌నగర్‌లో ఏర్పాటు చేసిన వార్డు ఆఫీసులను మంత్రి తలసాని, గోషామహల్‌లోని మూడుచోట్ల హోంమంత్రి మహమూద్ అలీ, ముషీరాబాద్ రాంనగర్‌లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, ఖైరతాబాద్ చింతల్‌బస్తీ, నాంపల్లి మెహిదీపట్నంలో మేయర్ విజయలక్ష్మి, నాంపల్లిలోని విజయ్‌నగర్‌కాలనీ, బజార్‌ఘాట్‌లలో ఎమ్మె ల్సీ ప్రభాకర్‌రావు, అహ్మద్‌నగర్, సాయిబాబా దేవాలయాల వద్ద ఏర్పాటు కార్యాలయాలను నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు.