ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి మార్పులు చేసింది. ఆగస్టు 14న జరగాల్సిన కౌన్సెలింగ్ వాయిదా వేసి.. సెప్టెంబర్ 6కు మార్పు చేసింది. దీంతో కొత్త షెడ్యూల్ను కూడా విద్యా శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ 6 నుంచి 11 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్య కమిషనర్ వాకాటి కరుణ తెలిపారు. 8 నుంచి 12వ తేదీల వరకు ఐసెట్ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేయనుంది. సెప్టెంబరు 8 నుంచి 13వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
సెప్టెంబర్ 17న ఎంబీఏ, ఎంసీఏ తొలివిడత సీట్ల కేటాయింపు చేయనుంది. 22 నుంచి ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ జరగునుంది. 28న ఎంబీఏ, ఎంసీఏ తుది విడత సీట్లు కేటాయిస్తారు. సీటు వచ్చిన విద్యార్థులు 29, 30 తేదీల్లో సంబంధిత కాలేజీల్లో చేరాలని కన్వీనర్ తెలిపారు. 29న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కాకతీయ వర్సిటీ వెల్లడించింది. మరోవైపు కన్వీనర్ కోటాలో ఇంజినీరింగ్ సీటు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టు చేసేందుకు గడువు నేటితో ముగియాల్సి ఉండగా.. దాన్ని ఆదివారం వరకు పొడిగించినట్లు కన్వీనర్ తెలిపారు.
2023 ఫిబ్రవరి 28న ఐసెట్ నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా 2023- 24 విద్యా సంవత్సరానికి ఎంబీఏ, ఎంసీఏ వృత్తి విద్యా కోర్సులకి దరఖాస్తులు పెట్టుకోవాలని ప్రకటన జారీ చేసింది. ఆన్లైన్ ద్వారా మార్చి 06 నుంచి మే 06 వరకు గడవు ఇచ్చింది. అదనపు ఫీజుతో మే 18 వరకు అభ్యర్థులకు అవకాశం కల్పించింది. అనంతరం మే 26, 27 తేదీల్లో ఐసెట్ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించింది. 70,900 మంది అభ్యర్థులు ఈ పరీక్షను రాశారు. జూన్ 29న ఈ పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో 86.17 శాతం ఉత్తీర్ణత అవ్వగా.. 61,092 మంది అర్హత సాధించారని అధికారులు తెలిపారు. ఇందులో తొలి పది ర్యాంకుల్లో అబ్బాయిలే ఉన్నారు.