స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో దేశానికి తెలంగాణ దూసుకుపోయింది. ‘ఆదాయం పెంచాలి.. ప్రజలకు పంచాలి’ అంటూ సీఎం కేసీఆర్ చెప్పే సూత్రంతో రాష్ట్ర ఆర్థిక శక్తివంతంగా మారింది. అనతికాలంలోనే తెలంగాణ ఆర్థిక ప్రగతి అగ్రభాగంలో నిలిచింది. అతి తక్కువ సమయంలో సుసంపన్న రాష్ట్రంగా దేశం కీర్తిని అందుకున్నది. ఈ విషయాన్ని లోక్‌సభ సాక్షిగా కేంద్రమే అంగీకరించింది. దేశానికి ఆర్థిక భరోసానిస్తున్న రాష్ర్టా ల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్నదని కేంద్రమే ప్రకటించింది. సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బిట్రాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానమిచ్చారు. ఆరేండ్లలో దేశ జీడీపీకి తెలంగాణ వాటా 72 శాతం పెరిగిందని లోక్‌సభ సాక్షిగా అంగీకరించారు. తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్నదని, దేశాన్ని సాకుతున్న రాష్ట్రాల్లో కీలకంగా మారిందని రుజువైంది. తెలంగాణపై కేంద్రం చేస్తున్న ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలేనని తేలిపోయింది.
దేశ చరిత్రలో తెలంగాణది భౌగోళికంగా 11వ స్థానం. జనాభా పరంగా 12వ స్థానం. దేశ ఆర్థిక ప్రగతిలో మాత్రం తెలంగాణదే అగ్రపథం. ఒక దేశ ఆర్థిక ప్రగతిని ఆ దేశ జీడీపీని బట్టి అంచనా వేస్తారు. దేశ జీడీపీలో తెలంగాణది పెద్దన్న పాత్రని కేంద్రమే అంగీకరించింది. 2017-18 లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,79,358. ఆ తర్వాత ప్రతిఏటా తెలంగాణ వృద్ధి రేటును నమోదు చేస్తూనే ఉన్నది. తెలంగాణ ఏర్పడే నాటికి 2014-15లో రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,24,104. అప్పటికి తలసరి ఆదాయంలో దేశంలో తెలంగాణ స్థానం 10. కా నీ.. అనతికాలంలోనే తలసరి ఆదాయంలో తెలంగాణ అగ్రస్థానానికి ఎగబాకింది. తెలంగాణ కంటే చరిత్రలోనూ, ఆర్థికంగానూ ఎంతో పెద్ద రాష్ర్టాలన్నింటినీ వెనక్కి నెట్టి ముందుకు దూసుకెళ్లింది. దేశంలోని మిగిలిన అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి దేశ తలసరి ఆదాయం రూ.1,72,000 మాత్రమే. అంటే.. దేశ తలసరి ఆదాయం కంటే రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,36,732 ఎక్కువ. జీఎస్‌డీపీలోనూ తెలంగాణ అనూహ్యమైన వృద్ధిరేటును నమోదు చేసింది. 2017-18లో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.7,50,050 లక్షల కోట్లు ఉండగా.. 2022-23వ ఆర్థిక సంవత్సరానికి రూ.12,93,469 లక్షల కోట్లకు ఎగబాకింది.