స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బిఆర్ అంబేదర్ సచివాలయంలో సీఎస్ శాంతి కుమారి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ అంజనీ కుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హోం శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వి, జీఏడీ కార్యదర్శి శేషాద్రి ఇతర కార్యదర్శులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గోల్కొండ కోటలో ఆగస్టు 15న ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్మారక స్థూపం వద్ద స్వాతంత్ర్య సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని తెలిపారు.
పంద్రాగస్టు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీ ఏర్పాట్లను చేయాలని ఆదేశించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లోని అమర వీరుల స్మారక స్థూపం వద్ద కూడా ఆర్మీ జీవోసీ అధికారుల సమన్వయంతో తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీస్, రోడ్లు, భవనాలు, సమాచార శాఖ, జీహెచ్‌ఎంసీ, విద్యుత్, రవాణా తదితర శాఖలు తమ శాఖ పరమైన ఏర్పాట్లను చేపట్టాలని సీఎస్ ఆదేశించారు.