తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్(Congress) గట్టిగానే ఫోకస్ చేసింది. దృష్ట్యా కాంగ్రెస్ సీట్లు కేటాయింపులో గత నెల రోజులుగా సమావేశాలు నిర్వహిస్తోంది. పార్టీలోని బీసీ నేతలు కనీసం 34 సీట్లు కేటాయించాలని కోరుతూ దిల్లీ(Delhi) వెళ్లారు. దీంతో సీట్ల మంజూరు విషయం మరింత రసవత్తరంగా మారింది. దిల్లీ వెళ్లిన నాయకులకు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi), జాతీయ అధ్యక్షుడు ఖర్గే(National President Kharge)ను కలిసేందుకు అపాయింట్మెంట్ దొరకలేదు. చివరికి ఏఐసీసీ అధ్యక్షుడు కేసీ వేణుగోపాల్‌ను కలిశారు.
ఇక 50 బీసీ నాయకులు దిల్లీ వెళ్తే పలువురు నాయకులు మాత్రమే వేణుగోపాల్(Venugopal)తో సమావేశమయ్యారు. ఈ భేటీలో బీసీ నాయకుల పట్ల వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. పార్టీ అంతర్గత విషయాలను మీడియా ముందు ఎందుకు తీసుకువెళ్తున్నారని ఫైర్ అయ్యారు. ఎవరికి ఏ నియోజక వర్గంలో సీట్లు ఇవ్వాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాన్ని అయినా ఇస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పార్టీ లక్ష్యమన్నకేసీ.. కర్ణాటకలో బీసీల కోసం ఎలాంటి విధానం అనుసరించామో.. తెలంగాణలోనూ అదే మాదిరి అమలు చేస్తారని తెలిపారు.
రాష్ట్రంలో ఆశావాహుల నుంచి 1006 దరఖాస్తులు రాగా.. అందులో బీసీలకు చెందిన 41 నియోజకవర్గాల్లో మాత్రమే సీట్లు ఉన్నాయని పార్టీ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు నియోజక వర్గాల వారీగా.. పోటీలో ఉన్న వారి వివరాలు పరిశీలిస్తే.. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో హుస్నాబాద్ నుంచి మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, వేములవాడ నుంచి ఆది శ్రీనివాస్, కరీంనగర్ నుంచి కొనగల మహేష్‌లు దరఖాస్తు చేసుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో రామగుండం నుంచి రాజ్ ఠాకూర్, పెద్దపల్లి నుంచి గంటారాములు యాదవ్, ఈర్ల కొమురయ్య పోటీ పడుతున్నారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆదిలాబాద్ నుంచి గండ్ర సుజాత, సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి రావి శ్రీనివాస్, ముధోల్ నుంచి ఆనంద్ రావు పటేల్, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆర్మూర్ నుంచి గోర్తా రాజేందర్, శ్రీనివాస్‌రావు, నిజామాబాద్ అర్బన్ నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్(PCC Working President) మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఇరావత్రి అనిల్, కేశ వేణులు బరిలో దిగేందుకు దరఖాస్తు చేసుకున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలో దుబ్బాక నుంచి కత్తి కార్తీక గౌడ్(Kathi Kartika Goud), పటాన్ చెరు నుంచి కాట శ్రీనివాస్ గౌడ్, నర్సాపూర్ నుంచి గాలి అనిల్ కుమార్, సిద్దిపేట నుంచి శ్రీనివాస్ గౌడ్, పూజల హరికృష్ణలు పోటీ చేసేందుకు చొరవ చూపుతున్నారు.
జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలో బాన్సువాడ నుంచి బాలరాజు, నారాయణఖేడ్ నుంచి సురేష్ షట్కర్, మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మేడ్చల్ నుంచి తోటకూర జంగయ్య యాదవ్, మల్కాజ్గిరి నుంచి డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, ఎల్బీనగర్ నుంచి ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాష్కీ, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ముషీరాబాద్ నుంచి వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీశ్వర్ రావు, అంబర్పేట్ నుంచి ఓబీసీ ఛైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, యువజన కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు మొతా రోహిత్, లక్ష్మణ్ యాదవ్‌లు టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.