ప్రపంచం అంతటా ఎంతగానో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఆసియా కప్ కోసం టీమిండియా సన్నాహాలు ప్రారంభించింది. టోర్నీకి ముందు బెంగళూరులో ఆటగాళ్లు ప్రాక్టీస్ లో చెమటలు పట్టిస్తున్నారు. అందులో భాగంగానే.. 13 రోజుల ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లో ఆటగాళ్లకు యో-యో టెస్ట్ కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు 2 వారాల విరామంలో ఉన్న రోహిత్-కోహ్లీతో సహా ఆటగాళ్ల కోసం బీసీసీఐ ప్రోగ్రామ్ చార్ట్‌ను సిద్ధం చేసింది. రాబోయే ప్రపంచకప్ కోసం ఫిట్ గా ఉండాలనే ఉద్దేశ్యంతో.. విరామ సమయంలో కూడా వారిని వదలడం లేదు. అంతేకాకుండా అగ్రశ్రేణి ఆటగాళ్ల కోసం బీసీసీఐ 6 నియమాలను రూపొందించింది. వాటిని వారు ఖచ్చితంగా పాటించాలని పేర్కొంది. వెస్టిండీస్ పర్యటన నుండి తిరిగి వచ్చిన ఆటగాళ్లను 13 రోజుల కార్యక్రమాన్ని అనుసరించాల్సిందిగా కోరారు.
ఆ ఆటగాళ్లలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఉన్నారు. ఆగస్టు 9 నుండి 22 వరకు ఈ కార్యక్రమం కొనసాగింది. ప్రపంచకప్‌లో ఆటగాళ్లను ఫిట్ నెస్ గా ఉంచేందుకు ఈ కార్యక్రమం రూపొందించారు. రాబోయే రెండు నెలల పాటు ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలని తాము కోరుకుంటున్నామని, అందుకే ప్రత్యేక కార్యక్రమం చేశామని బీసీసీఐ అధికారి చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పాటించని ఆటగాళ్లపై టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆసియా కప్ 2023 కోసం బెంగళూరులో ఫిట్ నెస్ శిబిరం ప్రారంభం కాగా.. ఇందులో విరాట్ కోహ్లీ యో-యో టెస్టులో ఉత్తీర్ణుడయ్యాడు.