తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయనున్నట్లు తెలంగాణ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మరోసారి స్పష్టం చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరిగిన మేడ్చల్ పార్లమెంటరీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం.. నూతన అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీకి అత్యధికంగా గుర్తింపు ఉన్న మల్కాజ్‌గిరిలో రాబోయే ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేస్తామని భయపడి టీఆర్ఎస్ నాయకులు తరచు తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉంది అని ప్రచారాలు చేస్తూ ఓటర్లను మభ్యపెడుతున్నారన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసే తెలుగుదేశం పార్టీ నాయకులు అంతట ఉన్నారని వారిని మేల్కొలిపి ఓటు వేసేందుకు నడిపించాలని కార్యకర్తలకు సూచించారు. తెలుగుదేశం పార్టీ లేదని అన్న పార్టీలకు ఈ ఎన్నికలే గుణపాఠం కావాలని కాసాని జ్ఞానేశ్వర్ సూచించారు.
“ప్రజలు ఆర్భాటంలో లేరు.. ఈసారి ఓట్లు ఎవరికి వేయాలనే దానిపై ఓటర్లు డిసైడ్ అయి ఉన్నారు. క్రమశిక్షణ గల పార్టీ ఏది.. అభివృద్ధి చేసిన పార్టీ ఏది అని.. గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పూర్తి చేసిన పనులు ఏమిటని గుర్తు చేసుకోవాలి. ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం, మహిళలకు ఆస్తి హక్కులో వాటా ఇచ్చారు. చంద్రబాబునాయుడు మున్సిపాలిటీలను బలోపేతం చేశారు. ఎన్టీఆర్ చెక్‌డ్యాంలు నిర్మించారు. కావున తెలుగుదేశం మీద ప్రజలకు చాలా నమ్మకం ఉంది. తెలంగాణలో టీడీపీ బలంగానే ఉందని” కాసాని జ్ఞానేశ్వర్ వివరించారు.
ఈ కార్యక్రమంలో పార్లమెంట్ అధ్యక్షునిగా అశోక్ ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కాసాని జ్ఞానేశ్వర్ దిశానిర్దేశం చేశారు. ప్రతి నియోజకవర్గంలో నాయకులు 100 రోజుల ప్రణాళిక ప్రకారం బూత్ స్థాయి, వార్డు స్థాయిలో ప్రచారం నిర్వహించాలని, ప్రతి ఒక్కరు ఓటరును ఓటు వేసేందుకు తీసుకువచ్చే దిశగా ముందుకు సాగాలని తెలిపారు.