టీడీపీ నేత, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు(Former Minister Kalava Srinivasulu) ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(TDP leader Chandrababu) నాయుడును జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం శాంతినగర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద 2 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కాలవ శ్రీనివాసులు(Kalava Srinivasulu) దీక్షను పోలీసులు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో భగ్నం చేశారు. అర్ధరాత్రి(Mid night) నిరాహారదీక్ష శిబిరంలో నిద్రపోయిన కాల్వ శ్రీనివాసులును పోలీసులు మేలుకొల్పి అరెస్టు చేసి స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.
ఆమరణ నిరాహార దీక్ష శిబిరంలో కాలవ శ్రీనివాసులుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్షణగా నిలిచారు. పోలీసులకు టీడీపీ(TDP) నాయకులు మధ్య భారీగా తోపులాట జరిగింది. కాలవ శ్రీనివాసులును ఎక్కించుకొని వెళ్తున్న పోలీస్ జీప్‌ను కార్యకర్తలు అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా వారిని పక్కకు నెట్టి జీపును, కాన్వాయ్‌లను ముందుకు పోనిచ్చారు. కార్యాకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలవను అరెస్టు చేసి బలవంతంగా పోలీస్ జీప్‌లో ఎక్కించుకొని స్థానిక ప్రభుత్వ కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు. మాజీ మంత్రి ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. రాయదుర్గం ప్రభుత్వ వైద్యశాలలో కాలవ శ్రీనివాసులు వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్య పరీక్షలు చేసి, చికిత్సలు అందించారు.