హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు ప్రభుత్వం అన్నట్టుగా ప్రెసెంట్ పాలిటిక్సి్ నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కేంద్రం భారత్‌లో నేర సంబంధిత న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు సిద్దమైంది. ఈ క్రమంలోనే ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాలను.. కొత్త చట్టాలతో భర్తీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇక, ఈ బిల్లులపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే హాట్ కామెంట్స్ చేసింది.
ఇక, కేంద్ర ప్రభుత్వం బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం పట్ల తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ.. కేంద్రం తెచ్చిన మూడు బిల్లులకు హిందీ పేర్లు పెట్టడం భాషా సామ్రాజ్యవాదమని ఆరోపించారు. ఇది సమైక్య భారత దేశ మూలాలను కేంద్ర ప్రభుత్వం కించపరచడమే అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో తమిళంపై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో తమిళం అనే పదాన్ని పలకడానికి బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోడీకి హక్కు లేదు అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అన్నారు. డీకాలనైజేషన్ పేరుతో రీకాలనైజేషన్ చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఇది ఖచ్చితంగా తమ గుర్తింపును వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడని తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర ఆరోపణలు చేశారు.