నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన నటన, అభినయంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు జూ. ఎన్టీఆర్. ఈయన నటనకు ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రిటీలు సైతం జైజైలు కొడుతుంటారు. సినిమాల్లో రెండు దశాబ్దాలకు పైగా పూర్తి చేసుకున్న ఆయన ప్రయాణంలో హిట్లు, సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. ఇండస్ట్రీలో చాలా మంది తారక్‌ను సింగిల్ టేక్ ఆర్టిస్టు అని అంటుంటారు. అంతేకాకుండా తారక్ దర్శకుల హీరో అని కూడా అంటుంటారు. పాత్ర గురించి చెప్పడమే లేటు, తారక్ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాడు అంటూ రాజమౌళి ఓ సందర్భంలో వర్ణించాడు. నటుడిగానే కాదు డాన్సర్‌గా కూడా ఎన్టీఆర్ ది బెస్ట్ అనిపించుకున్నాడు. అభిమానులు ముద్దుగా టైగర్ అని పిల్చుకునే జూ. ఎన్టీఆర్ మే 20న 40వ వసంతంలోకి ఆడడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం..
తారక్ వెండితెర కంటే ముందు బుల్లితెరపై హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘భక్త మార్కాండేయ’ అనే సీరియల్ లో నటించాడు. ఈటీవీలో ప్రసారమయిన ఈ సీరియల్లో తారక్ మార్కండేయ పాత్రలో నటించాడు. ఈ సీరియల్ మొదటి ఎపిసోడ్ నవంబర్16,2000లో రిలీజైంది.
తారక్ చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడీలు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. తారక్‌కు తొమ్మిదేళ్ళ వయసున్నప్పుడు తాత సీనియర్ ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో చిన్న పాత్రలో నటింపజేశాడు. ఈ చిత్రంలో తారక్ నటనను చూసి మురిసిపోయాడు.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాల రామాయణం’ చిత్రంతో నటుడిగా మారాడు మా యంగ్ టైగర్. 1996లో విడుదలైన ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది.
సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అవకాశాల కోసం ఎన్నో సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరుగుతూ తనతో సినిమా చేయమని పలువురు దర్శకులు, నిర్మాతలను అడిగాడు. అలా బ్యాక్‌గ్రౌండ్ ఉండి కూడా తారక్ అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాడు.
రామోజీ రావు నిర్మించిన ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా మారిపోయాడు జూ. ఎన్టీఆర్. ఆ తరువాత ఎస్ఎస్. రాజమౌళి దర్శకుడిగా పరిచయమవుతూ తారక్‌తో ‘స్టూడెంట్ నం.1’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం తారక్‌ను హీరోగా నిలబెట్టింది.
ఈ సినిమా తర్వాత ‘సుబ్బు’ విడుదలై ఫ్లాప్‌గా నిలిచింది. అప్పుడే వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆది’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అప్పట్లోనే రూ.20కోట్ల షేర్‌ను సాధించింది. ఈ సినిమాతో తన ఫెరోషియస్ నటనతో ప్రేక్షకులను ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు.
‘ఆది’ తర్వాత ‘అల్లరి రాముడు’, ‘నాగ’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ క్రమంలోనే బాలకృష్ణ కోసం విజయేంద్రప్రసాద్ రాసుకున్న కథతో రాజమౌళి.. ‘సింహాద్రి’ తెరకెక్కించాడు. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించింది. స్టార్ డైరక్టర్లు, నిర్మాతలు, రచయితలు తన కోసం వెయిట్ చేసే రేంజ్ కి ఎదిగిపోయాడు ఈ బుల్లోడు.
ఆ తరువాత తారక్ నటించిన ‘ఆంధ్రావాలా’ సినిమా డియో ఫంక్షన్‌కు ఏకంగా 10లక్షల మంది అభిమానులు వచ్చారు. ఒక ఆడియో ఫంక్షన్‌కు అంతటి స్థాయిలో జనాలు రావడం అనేది అప్పట్లో పెద్ద చర్చగా మారింది. కానీ, 2004లో విడుదలైన ఈ చిత్రం భారీ ఫ్లాప్ గా మిగిలింది.
ఆ తరువాత వరుసగా ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’, ‘ఆశోక్’, ‘సాంబ’, ‘రాఖీ’ వంటి సినిమాలు కాస్త నిరాశపరిచాయి.
రాజమౌళి తారక్ కాంబినేషన్ లో 2007లో విడుదలైన ‘యమదొంగ’ సినిమా తారక్ ని కొత్తగా చూపించింది. ఈ చిత్రంలో తారక్ పోషించిన యముడు పాత్ర చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ డైలాగ్స్, డ్యాన్స్ ఇలా సినిమాలో ప్రతీది ప్రేక్షకులకు కట్టిపడేశాయి.
కంత్రి సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘అదుర్స్’, ‘బృందావనం’ బ్యాక్ టు బ్యాక్ హిట్లు సాధించాయి. ఇంకా ‘శక్తి’, ‘ఊసరవెల్లి’, ‘దమ్ము’, ‘బాద్‌షా’, ‘రామయ్యవస్తావయ్యా’, ‘రభస’ సినిమాలు అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించపోయాయి.
అలాంటి సమయంలో పూరి కాంబోలో తెరకెక్కిన ‘టెంపర్’ మంచి విజయాన్ని అందించింది. ఈ సినిమాతో మరోసారి మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు ఈ బుల్లోడు. ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారెజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ వంటి సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒక దానికి మరోకటి సంబంధం లేకుండా సినిమాలు చేసి వరుస విజయాలను సాధించాడు.
ఇంకా మూడున్నరేళ్ళు తరువాత విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమాలో ఆయన కొమరం భీం పాత్రలో ఒదిగిపోయారనే చెప్పాలి.
ప్రస్తుతం తన 30వ సినిమా కొరటాల శివతో చేస్తున్నాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపితే.. పరిశ్రమలో అంచనాలు పెంచుతోంది.
తారక్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ప్రక్షకులను ఆకట్టుకున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్‌బిస్ వంటి రియాల్టీ షోస్‌తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నటుడిగానే కాదు వ్యాఖ్యాతగా కూడా తనేంటో అని ఈ రెండు రియాలిటీ షోస్‌తో నిరూపించాడు.
రాబోయే రోజుల్లో ఎన్టీఆర్ మరిన్ని విజయాలు సాధించి అభిమానులను ఉర్రూతలూగిస్తూ.. ప్రేక్షకులను అలరిస్తూ.. తెలుగు సినిమా ఖ్యాతిని పెంచాలని కోరుకుంటూ.. మే 20న పుట్టినరోజు జరుపుకుబొతున్న మన యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు.