దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ ప్రియురాలు అంకిత లోఖండే ఇంట తీవ్ర విషాదం నెలకొంది. స్వతహాగా నటి అయిన అంకిత లోఖండే తండ్రి శశికాంత్ లోఖండే శనివారం (ఆగస్టు 12) కన్నుమూశారు. శశికాంత్ లోఖండే కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆయన వయసు ప్రస్తుతం 68 ఏళ్లు. అనారోగ్యమే ప్రధాన కారణం అని చెబుతున్నా ఆయన మృతికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, అతని అంత్యక్రియలు ఆగస్టు 13 న ఉదయం 11 గంటలకు ఓషివారా శ్మశాన వాటికలో జరుగుతాయని అంటున్నారు. ఇక గతంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ తో కొన్నాళ్ళు ప్రేమలో ఉన్న అంకిత ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. తరువాత సుశాంత్ సింగ్ రియా చక్రవర్తితో ప్రేమలో పడగా అంకిత కూడా విక్కీ జైన్ తో ప్రేమలో పడి వివాహం కూడా చేసుకున్నారు. ఇక శశికాంత్ లోఖండే మరణం గురించి అంకిత కానీ ఆమె భర్త విక్కీ జైన్ మరణానికి సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.
మీడియా వర్గాల సమాచారం మేరకు అంకిత తన తండ్రికి చాలా సన్నిహితంగా ఉండేది. ఆమె తరచుగా తన తండ్రితో ఫోటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండేది. అంకిత తన తండ్రి మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైందని నిరంతరం ఏడుస్తూ ఉన్న క్రమంలో ఆమె పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అంకిత కుటుంబం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందినది. ఆమె తండ్రి శశికాంత్ లోఖండే వృత్తిరీత్యా బ్యాంకర్. ఇక అంకితా సినిమాలు, సీరియల్స్ గురించి చెప్పాలంటే అంకిత తన కెరీర్‌ను స్మాల్ స్క్రీన్‌తో ప్రారంభించింది. ఏక్తా కపూర్ తన సీరియల్ పవిత్ర రిష్టాలో ఆమెకు మొదటి అవకాశం ఇచ్చింది. ఆ సీరియల్ ఆమెకు ఇంటి పేరుగా మారింది. అర్చన అనే క్యారెక్టర్ షోలో జనాలకు బాగా నచ్చింది. టీవీతో పాటు, అంకిత చాలా సినిమాల్లో కూడా నటించింది.