13 ఏళ్ల పాటు టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన సురేష్ రైనా అన్ని క్రికెట్ ఫార్మాట్ల నుంచి రిటైర్ అయినా విషయం తెలిసిందే. ఇప్పుడు తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ బిజినెస్ ని మొదలు పెట్టాడు సురేష్ రైనా. డాషింగ్ బ్యాటింగ్ కు, మెరుపు ఫీల్డింగ్ కు పెట్టింది పేరుగా ఉన్న మన రైనా ఇప్పుడు స్వదేశీ వంటలను విదేశీయులకి పరిచయం చేస్తూ లైఫ్ ని బిజీగా గడిపేస్తున్నాడు.
తనదైన ఆటతో అభిమానులను సంపాదించుకున్న రైనా.. ఇప్పుడు తన వంటలతో ఖండాతరాల్లో పేరును సంపాదించుకున్నటున్నాడు.
క్రికెట్ కు చాన్నాళ్ల క్రితమే వీడ్కోలు పలికిన ఈ ఘజియాబాద్ వాలా ఇప్పుడు తనకిష్టమైన ఆహార రంగంలోకి ప్రవేశించాడు. ఏకంగా, ఖండాంతరాలు దాటి యూరప్ నడిబొడ్డున నెదర్లాండ్స్ రాజధాని ఆమ్ స్టర్ డామ్ లో రెస్టారెంట్ నెలకొల్పాడు. అందులోను ఇది ఇండియన్ రెస్టారెంట్. దీని పేరు రైనా ఎస్సార్. భారతదేశపు నిధి నిక్షేపాల్లాంటి వంటలను వండి వార్చుతామంటూ రైనా హామీ ఇస్తున్నాడు. భారత్ వెలుపల రెస్టారెంట్ ఏర్పాటు చేయడంపై రైనా స్పందించాడు.
తనకు ఆహారం అన్నా, వండటం అన్నా పిచ్చి అని వెల్లడించాడు. భారత్ కు మాత్రమే పరిమితమైన నికార్సయిన రుచులను ఆమ్ స్టర్ డామ్ లోని తన రెస్టారెంట్ లో పరిచయం చేస్తానని తెలిపాడు. ఈ రెస్టారెంట్ లో వంటకాలు మాత్రమే కాదు నాణ్యత, సృజనాత్మకత, ప్రతి డిష్ లోనూ సంపూర్ణ సంతృప్తిని అందించడంలో తమ అంకిత భావాన్ని చూస్తారని రైనా పేర్కొన్నాడు. ఉత్తర భారతదేశానికి చెందిన మసాలా దట్టించిన వంటకాలు, దక్షిణ భారతదేశ ఘమఘమలు తన రెస్టారెంట్ కు వచ్చినవారిని నోరూరించేలా చేస్తాయని వివరించాడు.