జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఒకవైపు శాస్త్రీయ సర్వేను ఆపాలన్న మసీదు కమిటీ అభ్యర్థనను నిరాకరిచిన సుప్రీం.. సర్వేను ‘నాన్-ఇన్వేసివ్ టెక్నిక్’లో కొనసాగించాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించింది. ఇంతకు ముందు.. 17వ శతాబ్ది నాటి మసీదులో వజూఖానా మినహా మిగతా ప్రాంగణమంతా సర్వే జరిపారు. అయితే హిందూ ఆలయం స్థానంలో ఈ కట్టడాన్ని నిర్మించారా? లేదా? అనే విషయాన్ని నిర్ధారించాలని వారణాసి జిల్లా కోర్టు ఇటీవల తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పును అలహాబాద్ హైకోర్టు కూడా సమర్థించింది. దీంతో మసీదు ప్రాంగణంలో సర్వే కొనసాగించుకోవడానికి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఏఎస్‌ఐ అధికారులు సర్వే చేపట్టారు.
అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై న్యాయస్థానం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మసీదు కమిటీ వాదనలు వినిపిస్తూ.. ‘‘ప్రార్థనా ప్రదేశాల చట్టాలను ఉల్లంఘిస్తూ ఏఎస్‌ఐ.. 500 ఏళ్ల నాటి చరిత్రను తిరగదోడాలని చూస్తోంది. ఇలా చేస్తే గత గాయాలను మళ్లీ తెరిచినట్టే’’ అని వాదించింది.
పురావస్తు శాఖ, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపించారు. సర్వే సమయంలో మసీదు ప్రాంగణంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదని, నిర్మాణాలను ధ్వంసం చేయబోమని హామీ ఇచ్చారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేను కొనసాగించొచ్చని తెలిపింది. అయితే అదంతా ‘నాన్-ఇన్వేసివ్’ పద్ధతిలో జరగాలని ఆదేశించింది. మసీదు నిర్మాణాన్ని ధ్వంసం చేసేలా సర్వేలో ఎలాంటి పరికరాలను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది.