రాజస్థాన్‌లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఎప్పుడో ఒకప్పుడు జరుగుతూనే ఉన్నాయి. దినదిన గండం అన్నట్లుగా కోటాలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో ఆదివారం అక్కడ ఇద్దరు నీట్ ఆశావహులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఒత్తిడి తట్టుకోలేక శాంభాజీ కస్లే (17), ఆదర్శ్ రాజ్ (18) అనే విద్యార్థులు బలవణ్మరణానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాకు చెందిన శాంభాజీ కస్లే 12వ తరగతి చదువుతున్నాడు. కోటాలో మూడేళ్లుగా నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. అయితే ఆదివారం తాను కోచింగ్ తీసుకుంటున్న భవనం ఆరో అంతస్తు నుంచి అవిష్కర్ శంభాజీ కస్లే (17) అనే విద్యార్థి దూకేశాడు. అనతంరం తీవ్రంగా గాయపడిన కస్లేని కోచింట్ సెంటర్ సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తుండగా.. మర్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు.
బిహార్.. రోహ్తాస్ జిల్లాకు చెందిన ఆదర్శ్ రాజ్ అనే యువకుడు ఏడాది కాలంగా నీట్ కోచింగ్ తీసుకుంటున్నాడు. తన సోదరి, సోదరుడితో కలిసి డబుల్ బెడ్రూం ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతడి సోదరి, సోదరుడు కూడా కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే కస్లే మరణించిన నాలుగు గంటల తర్వాత.. తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు ఆదర్శ్. ఆదర్శ్ సోదరి, సోదరుడు తమ ఫ్లాట్‌కు చేరుకునేసరికి.. గదికి లోపలి నుంచి తాళం వేసి ఉందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తలుపు తెరిచి చూడగా ఆదర్శ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడని చెప్పారు. అయితే కొన ఊపిరితో ఉన్న ఆదర్శ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడని తెలిపారు. అయితే వీరి గదుల్లో ఎలాంటి సుసైడ్ నోట్లు (Kota Suicide Notes) లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే వీరు రోజువారి టెస్టులో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు చెప్పారు.
వీరిద్దరి మృతితో.. ఈ ఏడాది ఇప్పటివరకూ కోటాలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల సంఖ్య 22కు (Kota Suicide Data) చేరింది. ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపడుతున్నా ఈ ఘటనలు జరగడం గమనార్హం. కోటాలో కోచింగ్ సెంటర్లు (Kota Coaching Centre List) ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షలకు ఇక్కడకు కోచింగ్ తీసుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడే విద్యార్థుల సంఖ్య ఇక్కడ ఏటా పెరుగుతోంది.