హైదరాబాద్ వాసులకు మరో వంతెన అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ కె.కేశవరావు, జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. ఇందిరాపార్క్, అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ సమస్య లేకుండా బాగ్ లింగంపల్లి వీఎస్టీ జంక్షన్ సులభంగా చేరుకోవచ్చు. ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయానికి చేరుకోవడానికి ప్రయాణ సమయం తగ్గుతుంది. ఈ వంతెనకు మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టిన సంగతి తెలిసిందే.
రూ. 450 కోట్లతో నిర్మించిన ఈ వంతెన పొడవు 2.62 కి.మీ. ఈ వంతెన నిర్మాణానికి 12,500 మెట్రిక్ టన్నుల ఉక్కును ఉపయోగించారు. అంతేకాదు 20 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడారు. ఫ్లైఓవర్‌లో మొత్తం 81 స్టీల్ పిల్లర్లు, 46 పైల్ ఫౌండేషన్‌లను ఏర్పాటు చేశారు. నాలుగు వరుసలుగా ఉక్కు వంతెన నిర్మాణం సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ వంతెన నిర్మాణానికి 10 జూలై 2020న శంకుస్థాపన చేసింది. అయితే 2021 జనవరి నెలలో పనులు ప్రారంభం కాగా.. ఈరోజు ఈ వంతెనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దేశంలోనే మెట్రో వంతెనపై నిర్మించిన తొలి ఉక్కు వంతెన ఇదే. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన స్టీల్ బ్రిడ్జ్ కూడా ఇదేనని అధికారులు చెబుతున్నారు. మరోవైపు జీహెచ్‌ఎంసీ పరిధిలో భూసేకరణ లేకుండా నిర్మించిన తొలి వంతెన ఇదేనని అధికారులు చెబుతున్నారు.