విదేశీ పర్యటన ముగించుకుని ఆంధ్ర ప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) మళ్ళీ బిజీ షెడ్యూల్ లో పడిపోయారు. ప్రతిరోజు రాష్ట్ర అభివుద్ధే క్షేమంగా తమ కార్యాచరణను తీసుకెళ్తు.. రాష్ట్రాన్ని అభివుద్ది బాటలో పయనింపజేసేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారు. ఈ రోజు సీఎం క్యాంప్ కార్యాలయంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ(Deputy CM Kottu Satyanarayana), టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి(TTD Chairman Bhumana Karunakar Reddy), ఈవో ఏవీ ధర్మారెడ్డి(EO AV Dharma Reddy) ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిసి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. సీఎంకు ఆహ్వానపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. డిప్యూటీ సీఎం, టీటీడీ ఛైర్మన్, ఈవో.. ఇక అనంతరం వేద పండితుల వేద ఆశీర్వచనం చేశారు.. కాగా, ఈ నెల 18వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 9 రోజుల పాటు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది.
కాగా, ఈ ఏడాది అధిక మాసం కారణంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15 నుంచి 23 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీటీడీ ప్రకటించింది.. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా ఈ నెల 18న ధ్వజారోహణం, 22న గరుడ వాహనం, 23న స్వర్ణరథం, 25న రథోత్సవం, 26న చక్రస్నానం, ధ్వజావరోహణం జరుగనున్నాయి. అయితే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ప్రధానంగా అక్టోబరు 19న గరుడవాహనం, అక్టోబరు 22న స్వర్ణరథం, అక్టోబర్ 23న చక్రస్నానం కార్యక్రమాలను టీటీడీ నిర్వహించనుంది.