తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక దివ్యధామం అంటే ఠక్కున గుర్తేచ్చేది తిరుమల. ఏపీలోని చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ మహా దివ్యక్షేత్రానికి రోజుకు వేలాది మంది భక్తులు చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. కాలినడక వెళ్లిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గం, అలిపిరి గుండా కలియుగ వైకుంటేశ్వరుని దర్శించుకొని పునీతులవుతుంటారు. ప్రతి రోజు నిత్యం పండుగల జరిగే ఈ క్షేత్రంలో.. స్వామివారి బ్రాహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఆగమ పండితులు నిర్వహిస్తుంటారు.
అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని తితిదే ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. భక్తుల సౌకర్యం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, తిరుపతి కార్పొరేషన్ కమిషనర్, తితిదేలోని అన్ని విభాగాల అధికారులతో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఈవో సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు.
‘‘సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. సెప్టెంబరు 18న శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగుతాయి. ఉత్సవాల సందర్భంగా బ్రేక్ దర్శనాల సిఫారసు లేఖలు స్వీకరించం. స్వయంగా వచ్చే ప్రముఖులను మాత్రమే అనుమతిస్తాం. అలాగే వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం.
శ్రీవాణి ట్రస్టు నిధులతో ఆలయాలు నిర్మించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల్లోని భక్తులకు రోజుకు వెయ్యి మంది చొప్పున బ్రహ్మోత్సవ దర్శనం చేయిస్తాం. వీరికి ఉచిత రవాణా, భోజనం, బస కల్పిస్తాం. భక్తుల భద్రత దృష్ట్యా సెప్టెంబరు 22న గరుడసేవ రోజు ఘాట్ రోడ్‌లో ద్విచక్ర వాహనాల రాకపోకలను రద్దు చేశాం. అటవీ శాఖ తిరిగి ఆదేశాలు జారీ చేసే వరకు నడక మార్గాల్లో ఇప్పుడున్న నిబంధనలు కొనసాగుతాయి’’ అని ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.