హైదరాబాద్ లోని నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో ఇవాళ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వివాదంపై మరోసారి విచారణ జరిగింది. ఈ నెల 19న మహబూబ్‌నగర్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదుదారుడు రాఘవేంద్రరాజుకు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ కింద నోటీసుల జారీ చేశారు. నోటీసులపై వారంలోపు కోర్టులో సమాధానం చెప్పాలని పోలీసులు నోటీసుల్లో తెలిపారు. అయితే, పోలీసులు ఇచ్చిన నోటీసులను పిటిషనర్ రాఘవేంద్రరాజు కోర్టులో సవాల్ చేస్తూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు మంత్రిని ఉద్దేశపూర్వకంగా తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పిటిషన్‌పై విచారణ జరిపిన ప్రజాప్రతినిధుల కోర్టు తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది.
మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ వివాదంపై గతంలో దాఖలైన పిటిషన్‌పై విచారణ చేసిన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు.. శ్రీనివాస్‌గౌడ్, పలువురు అధికారులపై కేసు నమోదు చేయాలని మహబూబ్‌నగర్ పోలీసులను ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను పాటించలేదని.. వారిపై మహబూబ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్ర రాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీనిపై ఆగస్టు 11న ప్రజాప్రతినిధుల కోర్టు మరోసారి విచారణ చేసింది. వాదనలు విన్న ధర్మాసనం.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెంటనే సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సహా 11 మందిపై కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ గౌడ్, పలువురు ఎన్నికల అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు.