తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బొప్పన సత్యనారాయణరావు కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన హైదరాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడ్డారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీఎస్ రావు కోలుకోలేకపోయారు. ఆయన భౌతికకాయాన్ని ఈ సాయంత్రం విజయవాడకు తరలించనున్నారు. బీఎస్ రావు అంత్యక్రియలు విజయవాడలో నిర్వహించనున్నారు. డాక్టర్ బీఎస్ రావు పూర్తి పేరు బొప్పన సత్యనారాయణరావు. 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను ప్రారంభించి, అనతికాలంలోనే ఆ సంస్థలను అగ్రగామి పథంలో నడిపించారు. మొదట విజయవాడలో బాలికల జూనియర్ కళాశాలతో ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగి, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్, ఎంసెట్ కు కేరాఫ్ అడ్రెస్ గా శ్రీచైతన్యను ఉన్నతస్థానానికి చేర్చారు. డాక్టర్ బీఎస్ రావు 321 జూనియర్ కాలేజీలు, 322 టెక్నో స్కూళ్లు, 107 సీబీఎస్ఈ స్కూళ్లు స్థాపించారు.
ఇంగ్లండ్, ఇరాన్‌లో వైద్యులుగా సేవలందించిన బీఎస్‌రావు దంపతులు 1986లో శ్రీచైతన్య విద్యాసంస్థలను స్థాపించారు. తొలుత విజయవాడలో బాలికల జూనియర్ కళాశాల ప్రారంభించారు. విజయవాడ నుంచి విద్యాసంస్థలను అంచెలంచెలుగా విస్తరించారు. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.