గత నెల 18న అధిక శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు నిజ శ్రావణ మాసం ఉంటుంది. నిజ శ్రావణ మాసంలో ఈ నెల 17 నుంచి వచ్చేనెల 15 వరకు శ్రీశైలం మహాక్షేత్రంలో శ్రావణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అధిక శ్రావణ మాసంతోపాటు నిజ శ్రావణ మాసంలో, సెలవు రోజుల్లో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం శ్రావణ మాసోత్సవంలో పర్వదినాలు, సెలవు దినాల్లో ఆర్జిత అభిషేకాలను నిలిపివేయాలని దేవస్థానం నిర్ణయించింది.
శ్రీ స్వామి వారి స్పర్శ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో పొందాల్సి ఉంటుంది. దేవస్థానం వెబ్‌సైట్ – `www.srisailadevasthanam.org` ద్వారా భక్తులు ముందస్తుగా ఆయా టికెట్లు పొందొచ్చు. శ్రీశైలం దేవస్థానం యాప్ ద్వారా కూడా ఈ టికెట్లు పొందొచ్చు. ఇప్పటికే ఆగస్టు మాస టికెట్ల కోటాను దేవస్థానం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ మాస టికెట్ల కోటా ఈ నెల 25 నుంచి అందుబాటులో ఉంచుతారు.
టికెట్ల లభ్యతను బట్టి దర్శన సమయం ప్రారంభానికి ఒక గంట ముందు వరకూ కూడా భక్తులు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే అవకాశం కల్పించింది దేవస్థానం. స్వామి వార్ల స్పర్శ దర్శనం టికెట్లు పొందిన వారు టికెట్ కాపీ (హార్డ్ కాపీ), ఆధార్ కార్డు ఒరిజినల్ లేదా జిరాక్స్ కాపీ తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఆయా సేవా టికెట్లు స్కాన్ చేసి.. ఆధార్ గుర్తింపుకార్డుతో సరి చూసిన తర్వాతే భక్తులను ఆయా ఆర్జిత సేవలు చేయడానికి అనుమతిస్తారు.
పై నిర్ధిష్ట రోజుల్లో కాకుండా తక్కిన మామూలు రోజుల్లో అనగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు గంటల నుంచి కల్పించే ఉచిత స్పర్శ దర్శనం యధావిధిగా కొనసాగుతుంది. కనుక ఆర్జిత సేవలు జరిపించే భక్తులు ఆయా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనం టికెట్ల లభ్యతకు అనుగుణంగా తమ శ్రీశైల యాత్ర రూపొందించుకోవాలని ఈఓ లవన్న కోరారు.
రూ.150 రుసుముతో శీఘ్ర దర్శనం (శ్రీ స్వామివారి అలంకార దర్శనం మాత్రమే), రూ.300 రుసుముతో అతి శీఘ్ర దర్శనం టికెట్లు (శ్రీ స్వామి వారి అలంకార దర్శనం మాత్రమే) ఆన్ లైన్ తోపాటు కరంట్ బుకింగ్ ద్వారా పొందవచ్చు. ఈ టికెట్లలో 30 శాతం ఆన్ లైన్, 70 శాతం కరంట్ బుకింగ్ తర్వాత విక్రయిస్తారు.