యాపిల్ ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత క్రేజుందో అందరికీ తెలిసిందే. ఇతర ఉత్పత్తులతో పోలిస్తే యాపిల్ ధరలు చాలా ఎక్కువగా ఉంటాయని చాలా మంది అంటారు. కానీ 40 ఏళ్ల క్రితం నాటి యాపిల్ కంప్యూటర్ రికార్డు ధర పలికి ప్రస్తుత ఉత్పత్తులను వెనక్కి నెట్టింది. 1976లో సంస్థ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వొజ్నియాక్ కలసి తయారుచేసిన తొలి కంప్యూటర్ యాపిల్ 1ను వేలంలో 355,500 డాలర్ల(సుమారు రూ. 2.3 కోట్లు)కు ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశారు.
న్యూ యార్క్ సిటీలో ఉన్న క్రిస్టీ సంస్థ కార్యాలయంలో ఈ వేలం నిర్వహించారు. వాస్తవానికి యాపిల్ 1 వచ్చిన సమయంలో దాని ధర 666.66 డాలర్లు (సుమారు రూ. 43 వేలు). ఈ రకం కంప్యూటర్లను మొత్తం 66 తయారుచేయగా ఇదొక్కటే ప్రస్తుతం వేలానికి మిగిలింది. ఇప్పటికీ ఇది పనిచేస్తుండటం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 50 యాపిల్ 1 కంప్యూటర్లను పలు మ్యూజియంలలో ప్రదర్శనకు ఉంచారని వేలం కంపెనీ క్రిస్టీ వెల్లడించింది.
అయితే యాపిల్ 1 కంప్యూటర్‌కు వేలంలో కోట్ల రూపాయలు పలకడం ఇది తొలిసారి కాదు. గతంలో ఇంతకన్నా ఎక్కువ ధరకే యాపిల్ 1 అమ్ముడుపోయింది. ఒక కంప్యూటర్ 905,000 డాలర్లు (సుమారు రూ. 5.8 కోట్లు) పలకగా.. మరొకటి 671,400 డాలర్లకు (సుమారు రూ. 4.3 కోట్లు) అమ్ముడుపోయింది.