ఈ రోజుల్లో బీమా లేకుండా వైద్య ఖర్చులు భరించడం అంటే చాలా కష్టం. సీనియర్ సిటిజన్లకు ఇది మరింత ఇబ్బందికరం. అందువల్ల, అన్ని వర్గాల వారు తప్పనిసరిగా ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవాలి. బీమా సంస్థలు 60 ఏళ్లు దాటిన వారికి కూడా పాలసీలను ఇస్తున్నాయి. అయితే, పాలసీ తీసుకునే ముందు ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి. ఆరోగ్యబీమా కొనుగోలు కోసం ప్రపోజల్ ఫారం పూర్తిచేస్తున్నప్పుడు అన్ని సరైన వివరాలే ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న జీవనశైలి వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు, ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లను ముందుగానే తెలియజేయాలి. దీనివల్ల క్లెయిం సమయంలో ఇబ్బందులు ఉండవు.
ఆరోగ్య బీమా తీసుకున్నప్పుడు బీమా సంస్థను బట్టి కొన్ని వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్ 1-4 ఏళ్లు వరకు ఉండే అవకాశం ఉంది. అందువల్ల తక్కువ వెయిటింగ్ పీరియడ్ పాలసీ ఇచ్చే బీమా సంస్థ కోసం చూడాలి. ఆయుర్వేదం, యోగా, నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతి వంటి చికిత్సలు ఆయుష్ కిందకి వస్తాయి. వీటికి కూడా బీమా కవరేజీ ఉంటుంది. కానీ, కొన్ని బీమా సంస్థలు ఆయుష్ చికిత్సకు ఉప పరిమితులు (సబ్-లిమిట్స్) విధిస్తున్నాయి. దీనికై గరిష్ఠ కవరేజీని అందించే బీమా సంస్థను ఎంచుకోవాలి.
ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమాకు యాడ్-ఆన్ లేదా రైడర్లు జతచేసి అదనపు ప్రయోజనాలు పొందొచ్చు. వీటికి కొంత అదనపు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా సరైన రైడర్ను ఎంపిక చేసుకుని వీలైనంత ఎక్కువ ప్రయోజనాన్ని పొందొచ్చు. మీ ప్రాథమిక ఆరోగ్య బీమాకు టాప్-అప్, సూపర్ టాప్ అప్ పాలసీలు బూస్టర్ డోస్ల వలె పనిచేస్తాయి. మీ ప్రాథమిక ఆరోగ్య బీమా కవరేజ్ దాటినప్పుడు ఇవి అమల్లోకి వస్తాయి. ఇప్పటికే తక్కువ బీమా మొత్తంతో ఆరోగ్య బీమా తీసుకున్న వారు కవరేజీ పెంచుకునేందుకు ఈ ప్లాన్లను తీసుకోవచ్చు.