ఉత్తరప్రదేశ్ (UTTAR PRADESH) రాష్ట్రం గుండా ప్రయాణం సాగిస్తున్న చంబల్ ఎక్స్‌ప్రెస్ రైల్లో (CHAMBAL EXPRESS) శనివారం రాత్రి కొందరు పాములను (SNAKES) విడిచిపెట్టారు. పాములను ఆడించినా.. ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఇలా చేశారు. దాంతో రైల్లో గందరగోళం నెలకొంది. పాములు కాటు వేస్తాయనే భయంతో కొందరు ప్రయాణికులు పై బెర్తుల(UPPER BERTH)పైకి ఎక్కారు. మరికొందరు మరుగుదొడ్లలో(WASHROOSM)కి దూరి గడియపెట్టుకున్నారు. 30 నిమిషాలపాటు ఈ తతంగం నడిచింది. వివరాల్లోకి వెళితే.. చంబల్ ఎక్స్‌ప్రెస్ హావ్‌డా(HAWADA) నుంచి గ్వాలియర్(GWALIOR) వెళ్తుంది. శనివారం రాత్రి ఆ రైలు మహోబా జిల్లా మలక్‌పుర గ్రామం(MALAKPUR) వద్దకు రాగానే పాములను ఆడించే నలుగురు వ్యక్తులు ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత వారు బుట్టలో నుంచి పాములను తీసి ఆడించడం మొదలుపెట్టారు. అనంతరం ప్రయాణికులను డబ్బులు అడిగారు. కొందరు ఇవ్వగా.. మరికొందరు నిరాకరించారు. దాంతో పాములను ఆడించే వ్యక్తులకు, ప్రయాణికులకు మధ్య వాగ్వాదం నెలకొంది. కోపోద్రిక్తులైన పాములను ఆడించే వ్యక్తులు బుట్టలు తెరిచి బోగీలో తాము తెచ్చిన పాములను వదిలిపెట్టారు. దాంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయి పై బెర్తులు ఎక్కారు. ఇంకొంత మంది మరుగుదొడ్లలో దూరారు. దాంతో సుమారు అరగంట సేపు రైల్లో భయానక వాతావరణం నెలకొంది.
ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే స్టేషన్ పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో పాములను ఆడించే వారు అప్రమత్తమై వదిలిపెట్టిన పాములను తిరిగి బంధించారు. ఆ స్టేషన్ రాక ముందే రైలు దిగి పరారయ్యారు. జరిగిన ఘటన గురించి ప్రయాణికులతో మాట్లాడామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికులెవరూ పాముకాటుకు గురికాలేదని ఆయన స్పష్టం చేశారు. బోగీలన్నీ వెతికినా నిందితులెవరూ కనిపించలేదని చెప్పారు. తనిఖీల తర్వాత రైలు గ్వాలియర్ బయలుదేరిందని వెల్లడించారు. రైల్లో అలజడికి కారణమైన వ్యక్తులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.