శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు తక్కువ ఖర్చుతో లభించాలంటే అందరి ఆప్షన్ కోడిగుడ్డు. అటు రుచిలో, ఇటు ఆరోగ్య ప్రయోజనాలు అందించడంలో ముందుండే ఎగ్‌కే చాలా మంది ఓటేస్తుంటారు. రోజంతా అలసట లేకుండా పనిచేసేందుకు అవసరమైన శక్తి, విటమిన్స్, మినరల్స్‌తో నిండిన ఎగ్ సంపూర్ణ ఆహారంగా వైద్యులు చెబుతుంటారు. అయితే ఎగ్స్ తీసుకోవడం ద్వారా స్టోర్ అయిన శక్తిని ఎలా బర్న్ చేయాలనే విషయం కీలకమని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు.
పోషకాల గని అయిన ఎగ్స్ రోజుకు ఎన్ని తీసుకుంటే మేలనే విషయంలో ఎన్నో అపోహలున్నాయి. ఎగ్స్ ఎంత మోతాదులో తీసుకోవాలనేది ఆయా వ్యక్తుల వయసు, వారు చేసే పనులు, వారి ఆరోగ్య పరిస్ధితి వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కోడిగుడ్లు అవసరానికి మించి తీసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే ప్రమాదం ఉంది. ఎగ్‌తో కూడిన బ్రేక్‌ఫాస్ట్ తీసుకునే వారిలో ఎగ్ లేకుండా బ్రేక్‌ఫాస్ట్ చేసేవారితో పోలిస్తే కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నట్టు జామా జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం వెల్లడించింది. కొలెస్ట్రాల్ పెరిగితే హృద్రోగ ముప్పు కూడా పెరిగే అవకాశం ఉంది.
ఇక పరిమితికి మించి గుడ్డు తినేవారిలో బరువు పెరిగే అవకాశం ఉంది. ఫైబర్, ప్రొటీన్ ఎగ్స్‌లో అధికంగా ఉన్నా వీటిని అతిగా తింటే బరువు పెరిగే ప్రమాదం పొంచిఉంది. గుడ్డు పరిమితికి మించి తింటే గ్యాస్, కడుపుబ్బరం, వికారం వంటి అజీర్తి సమస్యలు వెంటాడతాయి. సమతులాహారం తీసుకునే విషయంలో పెద్దలు రోజుకో గుడ్డు చొప్పున వారానికి మూడు నుంచి నాలుగుసార్లు గుడ్డు తినడం మేలని ప్రముఖ పోషకాహార నిపుణులు రూపాలి దత్తా సూచించారు. ఇక పిల్లలు ఎలాంటి సంకోచం లేకుండా ప్రతిరోజూ ఒక గుడ్డు తీసుకోవచ్చని చెబుతున్నారు. హృద్రోగ సమస్యలు, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారానికి మూడు గుడ్లు తీసుకుంటే సరిపోతుందని చెప్పారు.