కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2023-2024 ఏడాదికి గాను ప్రభుత్వ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం బడ్జెట్లో రెవెన్యూ వ్యయం రూ. 2,50,933 కోట్లు, మూలధన వ్యయం రూ. 54,374 కోట్లు, రుణాల చెల్లింపు రూ. 22,441 కోట్లు కేటాయించారు. విద్యకు రూ.37,587 కోట్లు, స్త్రీ, శిశు అభివృద్ధికి రూ. 24,166 కోట్లు. ఇది మొత్తం బడ్జెట్ కేటాయింపులో వరుసగా 11%, 7 శాతంగా ఉంది. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి రూ. 14,950 కోట్లు కేటాయించారు. గత బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాలను ఈ సందర్భంగా సీఎం సిద్దరామయ్య విమర్శించారు. సీఎంగా సిద్ధరామయ్యకు ఇది ఏడవ బడ్జెట్. ఈ బడ్జెట్ సిద్ధరామయ్య హాజరయ్యే 14వ బడ్జెట్ కూడా అవుతుంది. 13 బడ్జెట్‌లు ప్రవేశపెట్టిన మాజీ సీఎం దివంగత రామకృష్ణ హెగ్డే మార్కును ఆయన అధిగమించారు.
ముఖ్యమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో, మొత్తం 18 శ్లాబ్‌లపై ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ పై ప్రస్తుతం ఉన్న అదనపు ఎక్సైజ్ డ్యూటీని 20 శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. బీరుపై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని 175 శాతం నుంచి 185 శాతానికి పెంచనున్నారు. కర్ణాటక బడ్జెట్ మొత్తం రూ. 3,27,747 కోట్లుగా అంచనా వేస్తూ ప్రకటించారు.
ఐదు హామీల పథకాలతో అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఇచ్చిన 5 హామీలకు రూ.52 వేల కోట్లు కేటాయింపు ఉంటుందని, కోటి కంటే ఎక్కువ కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని, ఇది దేశంలోనే మొదటిసారిగా అమలు చేయబడుతుందని సిద్దరామయ్య ప్రసంగించారు. శాంతిభద్రతలకు, వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని సిద్ధరామయ్య పేర్కొ్న్నారు. “మా ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. మోరల్ పోలీసింగ్ పేరుతో ప్రజలను వేధించే వారిపై, సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు వార్తలను ప్రచారం చేసి సామరస్యానికి భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని సిద్ధరామయ్య అన్నారు. గతంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ (ఏపీఎంసీ) యాక్ట్‌లో చేసిన సవరణలను ఉపసంహరిస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. శివమొగ్గ, చిక్‌మగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, కొడగు, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తులను రవాణా చేయడానికి పికప్ వ్యాన్లను కొనుగోలు చేయడానికి ఏడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందజేస్తామని చెప్పారు.