భాగ్యనగరంలో మరోసారి మాదకద్రవ్యాల విక్రయం కలకలం సృష్టించింది. డ్రగ్స్ విక్రయిస్తూ సబ్ ఇన్‌స్పెక్టర్ కె.రాజేంద్ర(SI Rajendra) ఏసీబీ కేసులో.. సస్పెండ్ అవడంతో హైకోర్టులో నుంచి స్టే తెచ్చుకొని సైబరాబాద్ సైబర్‌క్రైమ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నాడు. పద్ధతి మార్చుకోకుండా మరోసారి అక్రమాలకు పాల్పడి జైలుపాలయ్యారు.2009లో ఎస్సైగా ఎంపికైన కె. రాజేంద్ర.. 2013లో రాయదుర్గం ఎస్సైగా పనిచేస్తున్నపుడు చోరీకి గురైన ద్విచక్రవాహనం తిరిగి ఇచ్చేందుకు బాధితుడి నుంచి డబ్బు డిమాండ్ చేశారు. ఆ సయమంలో బాధితుడు అవినీతి నిరోధకశాఖ అధికారులను ఆశ్రయించాడు. మాటువేసిన అనిశా అధికారులు.. బాధితుడి నుంచి 10వేలు తీసుకుంటుండగా ఎస్సైను పట్టుకొని అరెస్టు చేశారు.అనంతరం జైలు నుంచి విడుదలయ్యాక పలు ఠాణాల్లో విధులు నిర్వహించాడు. 2022 సెప్టెంబరు మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో.. ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రాజేంద్రను దోషిగా పరిగణించి 2 సంవత్సరాల జైలుశిక్ష తోపాటు 5వేల రూపాయలను జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. న్యాయస్థానం తీర్పుతో పోలీసు ఉన్నతాధికారులు అతణ్ని సస్పెండ్ చేశారు.
మాదక ద్రవ్యాల రవాణా కింగ్‌పిన్ అరెస్ట్..అనంతరం హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకొని.. తిరిగి విధుల్లోకి చేరారు. సైబర్ క్రైమ్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన రాజేంద్ర.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక కేసు దర్యాప్తులో మహారాష్ట్రాకు వెళ్లారు. అక్కడ నైజీరియాలో తనిఖీ చేస్తుండగా.. మాదకద్రవ్యాలున్న సంచిని గుర్తించారు. నిందితుడిని హైదరాబాద్ తీసుకొచ్చి అరెస్ట్ చూసి రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న మెథకొలిన్ డ్రగ్స్‌ను రాజేంద్ర మణికొండలోని తన నివాసంలో భద్రపరిచారు. దాదాపు కోటి రుపాయలు విలువైన డ్రగ్‌ను విక్రయించి సొమ్ము చేసుకోవాలని ప్రణాళిక రచించారు. గ్రాముల చొప్పున కూకుండా పూర్తి మాల్ విక్రయించాలనే నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఒక ఎస్సై, ఇద్దరు కానిస్టేబుల్స్‌తో చెప్పారు. ఒకేసారి భారీ మొత్తంలో సొమ్ము చేతిలో పడుతుందని.. సహకరిస్తే కమీషన్ ఇస్తానంటూ సహచరులకు ఆశచూపారు.
మణికొండలోని ఒక వ్యక్తి వద్ద ఖరీదైన మత్తుపదార్ధం విక్రయాలు జరుపుతున్నారని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో పోలీసులకు సమాచారం వచ్చింది. డ్రగ్స్ పెడ్లర్‌ను సరుకుతో సహా.. పట్టుకోవాలనే ఉద్దేశంతో యాంటీ నార్కొటిక్ బ్యూరో ప్రణాళిక సిద్ధం చేసుకుంది.డెకాయ్ ఆపరేషన్‌తో తామే కొనుగోలుదారులుగా నమ్మించి.. ఎస్సై రాజేంద్ర బయటకు వచ్చేలా చేశారు.శనివారం మధ్యాహ్నం తాను దాచిన డ్రగ్స్ పొట్లాలు తీసుకొని బయల్దేరాడు రాజేంద్ర. అప్పటికే కాపుగాసిన పోలీసులు నిందితుడి అదుపులోకి తీసుకున్నపుడు.. డ్రగ్ విక్రయాలు జరుపుతున్న ఎస్సై రాజేంద్రగా గుర్తించారు. మత్తుపదార్ధాల తోపాటు ద్విచక్రవాహనం, నిందితుడిని రాయదుర్గం పోలీసులకు అప్పగించారు. శనివారం సాయంత్రం రాజేంద్రని అరెస్ట్ చేసి.. రిమాండ్‌కు తరలించారు.ఎస్సై అరెస్టు విషయం బయటపడితే పరువు పోతుందనే ఉద్దేశంతో పోలీసులు విషయాన్ని గోప్యంగా ఉంచారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలోనూ ఎస్సై రాజేంద్ర మౌనంగా ఉన్నట్టు సమాచారం. మహారాష్ట్రలో నైజీరియన్ల నుంచి 5 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని.. దానిలో కొంతభాగం అక్కడి పోలీసులు తీసుకెళ్లినట్టు పోలీసుల దర్యాప్తులో గుర్తించారు. దీనిపై మరింత సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఎస్సై రాజేంద్ర కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.