మన దేశంలో ఎన్నో చారిత్రాత్మకమైన, పురాతన ఆలయాలు ఉన్నాయి. అందులోనూ దక్షిణ భారతంలో ఉండే ఆలయాలకు అత్యద్భుతమైన ప్రత్యేకతలు, అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి. వాటీలో ఒక్కటి తమిళనాడులోని చిదంబర నటరాజ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో మనం నమ్మలేని వింతలు, విశేషాలు ఎన్నో దాగి ఉన్నాయి. హరిహర క్షేత్రాలుగా విరాజిల్లుతున్న ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒక్కటి. ఎన్నో రహస్యాలకు పుట్టినిల్లు అయినా ఈ ఆలయ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శివుని మూడు రూపాలు:
తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఉండే చిదంబరం పేరు చెప్పగానే ప్రతి ఒక్కరికీ టక్కున గుర్తొచ్చేది నటరాజ స్వామి. ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో మాత్రమే శివుడు అలంకార భూషితుడై నటరాజ స్వామి రూపంలో దర్శనమిస్తాడు.
ఇక రెండోది లింగ రూపం. పంచభూతాలలో ఒక్కటైనా ఆకాశానికి ప్రతీకగా చిదంబరాన్ని పరిగణిస్తారు. ఇక్కడ లింగాన్ని ఆకాశ లింగం అంటారు. శ్రీకాళహస్తిలోని వాయు లింగం, కంచిలోని పృథ్వి లింగ, చిదంబరంలోని ఆకాశ లింగ.. ఈ మూడు దేవాలయాలు ఒకే రేఖాంశం మీద ఉంటాయి. శాస్త్రీయ పరంగా 79 డిగ్రీల 41 నిమిషాల రేఖాంశం ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ ఆశ్చర్యకమైన వాస్తవాన్ని శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు.
ఇక మూడవ రూపమే చిదంబర రహస్యం. ఈ రూపం ఇది అని చెప్పలేని చంద్రమౌళీశ్వర రూపం. ఇక్కడ గర్భాలయంలో వెనక గోడపై ఒక చక్రం ఉంటుంది. దానికి ముందు భాగంలో బంగారం బిల్వ పత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. అయితే వీటిని భక్తులకు కనబడకుండా ఓ తెరను అడ్డుగా ఉంచుతారు. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. అంటే దైవంలో మనస్సు ఏకమయ్యే ప్రదేశం అని అర్థం.
దేహమే దేవాలయం:
ఈ చిదంబర ఆలయానికి మానవ దేహానికి చాలా దగ్గరి సంబంధం కనిపిస్తుంది. ఈ ఆలయంలోని గర్భ గుడి (పొన్నాంబళం) ఎడమ వైపుకి ఉంటుంది. అంటే మనిషిలో హృదయ స్థానం. మానవుడికి నవ రంధ్రాలు ఉన్నట్లు.. చిదంబరం దేవాలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. గర్భాలయానికి వెళ్ళడనికి పంచాక్షర పడి ఎక్కాలి. అది న+మ+శి+వ+య పంచాక్షరిని సూచిస్తుంది.
“కనక సభ”లో 4 స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు 28 శైవ ఆగమాలకు ప్రతీకలు – శివారాధనా పద్ధతులు.అర్ధ మంటపంలోని 6 స్తంభాలూ 6 శాస్త్రాలకు ప్రతీకలు. పక్కన ఉన్న మంటపంలోని 18 స్తంభాలూ 18 పురాణాలకి ప్రతీకలు. నటరాజు నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్సు అని వర్ణించారు.
చిదంబరంలో ఉన్న నటరాజ విగ్రహం కాలి బొటన వేలు, భూమి అయస్కాంత క్షేత్రానికి మధ్య బిందువు అని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని తన గ్రంధం “తిరుమందిరం”లో ప్రసిద్ధ తమిళ స్కాలర్ తిరుమూలర్ వివరించారు. ఈ గుడిలో నటరాజ స్వామిని దర్శం చేసుకుని బయటికొచ్చి వెనక్కి తిరిగి చూస్తే ఈ దేవాలయానికి సంబంధించిన గోపురం మన వీపు వెనుకే వస్తున్న అనుభూతి కలుగుతుంది. ఇన్ని అద్భుతాలు కలిగిన ఈ ఆలయంలో అంతుపట్టని ఎన్నో రహస్యాలు.