‘మోదీ ఇంటి పేరు’ కేసులో శిక్ష పడిన కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి.. సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఈ కేసులో గరిష్ఠ శిక్ష విధించేందుకు ట్రయల్ జడ్జి ఎటువంటి కారణం చెప్పలేదు. ఈ క్రమంలో దోషిగా నిర్ధారించే తీర్పును నిలిపేయాలి. ఈ తరహా వ్యాఖ్యలు మంచివి కావన్న విషయంలో సందేహమే లేదు. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి బహిరంగ ప్రసంగాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని అందరూ ఆశిస్తారు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ కేసులో తాను నిర్దోషినని, తనకు విధించిన రెండేళ్ల శిక్షపై స్టే విధించాలని రాహుల్ గాంధీ.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ సంజయ్ కుమార్‌లతోకూడిన ధర్మాసనం శుక్రవారం ఈ కేసు విచారణ చేపట్టింది. రాహుల్ తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ.. పరువు నష్టం దావా వేసిన, గుజరాత్‌కు చెందిన భాజపా ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ అసలు ఇంటిపేరు ‘మోదీ’ కాదని, ఆయన ఆ ఇంటిపేరును తర్వాత పెట్టుకున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.
రాహుల్ గాంధీ నేరస్థుడు కాదని, బీజేపీ కార్యకర్తలు గతంలోనూ ఆయనపై అనేక కేసులు వేసినప్పటికీ.. ఏ కేసులోనూ శిక్ష పడలేదని సింఘ్వీ వాదించారు. పార్లమెంటుకు హాజరయ్యేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకుగానూ.. రాహుల్ గాంధీ నిర్దోషిగా విడుదలయ్యేందుకు ఇదే చివరి అవకాశమని తెలిపారు.
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో జరిగిన ఓ ఎన్నికల సభలో మోదీ ఇంటిపేరుపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై పూర్ణేశ్ మోదీ పరువు నష్టం దావా వేశారు. దీంతో సూరత్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. ఫలితంగా ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద ఆయనపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్వత్వాన్ని కోల్పోయారు. ఈ క్రమంలోనే శిక్షపై స్టే విధించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు కొట్టేయగా.. దీన్ని సవాలు చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై తాజాగా స్టే విధించింది.