ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్ల గుడ్ న్యూస్ చెప్పింది. తన పరిమితకాల స్పెషల్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్ డిపాజిట్’ పథకం గడువును మరోసారి పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. 400 రోజుల కాలవ్యవధితో వస్తున్న ఈ పథకం గడువు ఆగస్టు 15తో ముగియాల్సి ఉంది. దీనిని ఈ ఏడాది చివరి వరకుపొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 వరకు ఈ పథకంలో మదుపు చేసే అవకాశం కల్పించింది. గతంలోనూ ఈ గడువును పలుమార్లు ఎస్బీఐ పొడగించిన విషయం తెలిసిందే.
ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం, మిగిలిన వారికి 7.1 శాతం వడ్డీరేటు లభిస్తుంది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం వడ్డీపై మూలం వద్ద పన్ను (TDS) కోత ఉంటుంది. ఎస్బీఐ శాఖలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్బీఐ యోనో యాప్ ద్వారా ఈ ప్రత్యేక ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ.2 కోట్లలోపు మొత్తాలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. స్వల్పకాలిక లక్ష్యంతో మదుపు చేసేవారికి అమృత్ కలశ్ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. పైగా డిపాజిట్‌ను ముందుగా ఉపసంహరించుకోవచ్చు. అలాగే రుణ సదుపాయం కూడా ఉంది
ప్రస్తుతం ఇతర ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలపై (అమృత్ కలశ్ పథకం కాకుండా) 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలవ్యవధికి గానూ సాధారణ పౌరులకు 3 నుంచి 7 శాతం వడ్డీరేటును ఎస్బీఐ చెల్లిస్తోంది. సీనియర్ సిటిజన్లకు 50 బేసిస్ పాయింట్లు అదనంగా.. 3.5 శాతం నుంచి 7.50 శాతం వడ్డీ చెల్లిస్తోంది. 2-3 ఏళ్ల కాలవ్యవధిపై ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ పౌరులకు గరిష్ఠంగా 7 శాతం వడ్డీ చెల్లిస్తుండగా.. అదే కాలవ్యవధికి సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. రూ.2కోట్ల లోపు డిపాజిట్లకు ఈ వడ్డీ రేట్లు వర్తిస్తాయి.