ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు శ్రేయోభిలాషులు తనను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని.. కానీ తాను ఎప్పటికీ బీజేపీతో పొత్తు పెట్టుకోనని ఎన్సీపీ (శరద్ వర్గం) అధినేత శరద్ పవార్ స్పష్టం చేశారు. ఎన్సీపీ రాజకీయ విధానానికి బీజేపీతో అనుబంధం కుదరదని ఆదివారం స్పష్టం చేశారు. అజిత్ పవార్‌తో తన భేటీ రహస్యమేమీ కాదని.. అతడు తన అన్న కుమారుడని చెప్పారు. ఓ కుటుంబ పెద్ద తన కుటుంబంలోని వ్యక్తిని కలవడంలో తప్పేమిటి? అని శరద్ పవార్ సూటిగా ప్రశ్నించారు. అలా కలవాలని కోరుకుంటే ఎలాంటి సమస్య ఉండకూడదని ఆయన అన్నారు.
అజిత్ పవార్‌తో ‘రహస్య’ సమావేశం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు.”మాలో కొందరు (అజిత్ పవార్ వర్గం ఎన్సీపీ) వేరే స్టాండ్ తీసుకున్నారు. మా శ్రేయాభిలాషులు కొందరు మా వైఖరిలో కూడా మార్పు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆ విషయాన్ని వారు మాతో చర్చించడానికి చూస్తున్నారు” అని శరద్ పవార్ పేర్కొన్నారు.
మహారాష్ట్రలో ఎన్సీపీ రెబల్ వర్గ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఆదివారం ఆ పార్టీ అధినేత శరద్ పవార్‌ను కలిశారు. ఎన్సీపీ మంత్రులతో పాటు కలిసిన ఆయన పార్టీ చీలిపోకుండా ఐక్యంగా ఉంచాలని శరద్‌ను అభ్యర్థించారు. అనంతరం ఆ పార్టీ నేత ప్రఫుల్ పటేల్ మీడియాతో మాట్లాడుతూ తమ విజ్ఞప్తిని శరద్ పవార్ ఆలకించారని, అయితే ప్రతిస్పందించలేదని అన్నారు.
సీఎం ఏక్‌నాథ్ షిండే ఆదివారం ఇచ్చిన తేనీటి విందుకు విపక్ష పార్టీలు గైర్హాజరయ్యాయి. ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా దూరంగా ఉన్నట్టు శివసేన (యూబీటీ), శరద్‌పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రకటించాయి.