అనేక పరిణామాల తర్వాత భూమిలో ఉన్న ముడి పదార్థం బంగారంగా మారుతుంది, సమ్మెట పోట్లు, అగ్ని తాపాన్ని భరించి ఆభరణంగా మారుతుంది. అలాంటి ఆభరణమే కష్టానికి ప్రతి రూపంగా వచ్చి తల్లిదండ్రుల కళను నిజం చేసింది. నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తూ అద్భుతంగా ఏకంగా అరకోటి ప్యాకేజీ జాబ్ నే స్వంతం చేసుకుంది. కష్టపడాలనే ఆలోచన ఉండాలే గానీ.. అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేందుకు ఓ అమ్మాయి నిదర్శనంగా నిలుస్తోంది. లక్షల ప్యాకేజీలు ఈరోజుల్లో సాధారణమైపోయాయి. కానీ దానిని సాధించేందుకు ఆ యువతి మొదటి సంవత్సరం నుంచే ఆ దిశగా అడుగులేస్తు ముందుకు సాగింది. మైక్రోసాఫ్ట్‌లో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లి.. అదే సంస్థలో అరకోటి ప్యాకేజీ ఉద్యోగాన్ని అవలీలగా పట్టేసింది.
సంగారెడ్డి జిల్లా ముదిమాణిక్యం(Madimanikya) గ్రామానికి చెందిన సంహిత (Samhita)అనే యువతి చిన్నప్పటి నుంచి చదువుల్లో ముందు ఉండేది. పుష్పలత, విష్ణువర్ధన్ రెడ్డిలు ఆమె తల్లిదండ్రులు. సంహిత ఇంటర్మీడియట్ పూర్తిచేసిన తరువాత ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించింది. ప్రస్తుతం నర్సాపూర్‌లోని బీవీఆర్‌ఐటీ కాలేజీ(BVRIT College)లో సీఎస్‌ఈ నాలుగో సంవత్సరం చదువుతోంది. నిత్యం ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోవాలనే సంకల్పమే తనను ఈ స్థాయికి చేర్చిందని చెబుతోంది. తనకు గురువులు చేసిన సాయం మర్చిపోలేనని తెలిపింది.
గురువుల సూచనలు, తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే రూ.52 లక్షల ప్యాకేజీ అందుకునే స్థాయికి చేరానని సంహిత చెప్పింది. అయితే తనలో నేర్చుకోవాలనే తపన ఉన్న విషయాన్ని కళాశాల గుర్తించిందని చెబుతోంది. దాంతో పాటు తన భవిష్యత్ ప్రణాళికల వివరాలను తెలిపింది. గతంలో మైక్రోసాఫ్ట్(MicroSoft Job)లో ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లినప్పుడు నెలకు లక్ష 25 వేల రూపాయల స్టైఫండ్‌తో మూడు నెలలు పూర్తిచేసింది. తర్వాత అందులోనే ఉద్యోగాన్ని సాధించింది. నేర్చుకోవాలనే కోరిక ఉంటే ఏదైనా సాధ్యమేనని.. తన జూనియర్లకు కూడా సలహాలిస్తోంది.
ఇంజినీరింగ్ సమయంలో ఖాళీగా ఉండకూడదని.. నిత్యం పుస్తకాలు చదవాలని అప్పుడే జ్ఞాన సముపార్జన చేయగలమని సూచనలు ఇచ్చింది. ఎక్కువ సమయాన్ని లైబ్రరీలోనే గడిపిందని తెలిపింది. ఈమెలో ఉన్న ఆసక్తిని గమనించి.. కళాశాల కూడా అండగా నిలిచింది. తమ విద్యార్థిని ఈ స్థాయికి చేరడం గర్వంగా ఉందని అధ్యాపకులు చెబుతున్నారు. మట్టిలో మాణిక్యాలు అంటే ఇలాంటి వారే. పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ.. అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే యువత లక్ష్యంగా చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని చేరేందుకు సరైన ప్రణాళికతో ముందుకు సాగితే అసాధ్యమైనదేదీ లేదు.