తెలంగాణలోని దివంగత కళాకారుడు సాయిచంద్ కుటుంబానికి అధికార బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. పార్టీ తరపున సాయిచంద్ భార్య రజినీకి పార్టీ నేతలు కోటి రూపాయల చెక్ ను అందించారు. ఆమె ఇంటికి వెళ్లిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కోటి రూపాయల చెక్ ను అందజేశారు. అనంతరం రజినీని మంత్రి సబిత ఓదార్చారు. సాయిచంద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి 50లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో 50లక్షలు సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి ఇస్తామన్నారు. సాయిచంద్ కుటుంబానికి పూర్తిగా అండగా ఉంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. భర్తను కోల్పోయిన భార్య బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసన్నారు. సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రి సబిత ధన్యవాదాలు తెలిపారు.
సాయిచంద్ కుటుంబానికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ ఫండ్ నుంచి ఈ డబ్బు అందజేసినట్లు ఆ పార్టీ నేతలు వెల్లడించారు. సాయిచంద్ కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నతండ్రిలా అండగా ఉంటారని వెల్లడించారు. కేసీఆఆర్ ఆదేశాల మేరకు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, దాసోజు శ్రవణ్.. గుర్రంగూడలోని సాయిచంద్ ఇంటికి వెళ్లి కోటి రూపాయల చెక్ ను సాయిచంద్ భార్యకు అందజేశారు. సాయిచంద్ తన పాటతో తెలంగాణ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న మహా కళాకారుడు అని బీఆర్ఎస్ నేతలు కీర్తించారు.
తన ఆట పాటతో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ అడుగులో అడుగుగా ప్రతి బహిరంగ సభలో తన ఆటపాటలతో బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమైనట్లు వెల్లడించారు. కాగా, గుండెపోటుతో సాయిచంద్ మరణించారు. సాయిచంద్ కుటుంబానికి అండగా ఉంటానని ప్రకటించిన సీఎం కేసీఆర్.. సాయి చంద్ భార్య రజనీని గిడ్డంగుల కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించన విషయం తెలిసిందే. ఇప్పుడు కోటి రూపాయల చెక్ ను కూడా అందజేశారు.