ఇరిటేషన్ స్టార్ రెండు రోజులుగా వాలంటీర్లని, సీఎంను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. సీఎం వైఎస్ జగన్ అంటే వణుకు అనుకున్నా.. జగన్ తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ అన్నా వణుకే అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు మంత్రి ఆర్కే రోజా.. కానీ, వాలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేవు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 2024లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అర్ధం అయ్యింది.. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు.. పవన్ వాలంటీర్ల కళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి.. లేదంటే వాళ్లే పవన్ సంగతి తెలుస్తారు అంటూ వార్నింగ్ ఇచ్చారు రోజా.
మహిళల అక్రమ రవాణా వాలంటీర్ల వల్లే జరుగుతుంది అని పవన్ మాట్లాడటం సిగ్గు చేటు అని ఫైర్ అయ్యారు మంత్రి రోజా.. పవన్ కళ్యాణ్ కి సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు? వార్డ్ మెంబర్ గా కూడా గెలవని నీకు సమాచారం ఎవరు ఇచ్చారు..? అంటూ దుయ్యబట్టారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6 స్థానంలో ఉంది.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ము ఉందా? మాట్లాడితే హైదరాబాద్ లో వుండలేవు అంటూ కామెంట్ చేశారు. ఇక, నందమూరి బాలకృష్ణ.. జనసేన వాళ్లను.. అలగా జనం అన్నారు.. అదే బాలకృష్ణ ఇంటర్వ్యూకి పిలిస్తే ఎలా వెళ్లావు? అని ప్రశ్నించారు.
ఇక, సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యుల పేరు ఎత్తి మాట్లాడారా? అని ప్రశ్నించారు రోజా.. సాక్షాత్తు ముస్సోరి IAS సిలబస్ లో వాలంటీర్ వ్యవస్థ గురించి పెట్టారు అని గుర్తు చేశారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఏ సచివాలయానికి అయినా వెళ్దాం.. నేను గెలిచిన నగరి అయినా, భీమవరం, గాజువాక అయినా.. వాలంటీర్ల పని తీరు గురించి అక్క చెల్లెమ్మలను అడుగుదాం అంటూ సవాల్ చేశారు. పవన్ కళ్యాణ్ కి 55 సంవత్సరాలు వచ్చినా కనీసం ఎంపీటీసీ కూడా కాలేదు. కానీ, సీఎంని ఏక వచనంతో మాట్లాడతా అంటున్నారు.. మీ తల్లి నేర్పిన సంస్కారం ఇదా? అంటూ మండిపడ్డారు.. నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా? అని ప్రశ్నించారు. అంతలో తిరిగి… ‘నీ తల్లి చాలా గొప్పది.. అలా అనవద్దు. కానీ నీ వల్ల అందరూ ఆమెను అనే పరిస్థితి వచ్చిందని’ పవన్ ను ఉద్దేశించి మండిపడ్డారు. తల్లి సరిగ్గా పెంచితే ఇలా ఎందుకు ఉంటారు? అని అందరూ అంటుంటారని గుర్తు చేశారు. కానీ నీ తల్లి గొప్పదన్నారు. నీ తల్లి నేర్పిన సంస్కారం ఇదేనా అని వ్యాఖ్యానించినందుకు ‘అమ్మా.. నన్ను క్షమించమ్మా’ అని రోజా క్షమాపణ కోరారు.
ఆమె ఇంకా మాట్లాడుతూ.. జగన్ ను క్రిమినల్ అని పవన్ ఆరోపించారని, కానీ రోడ్లపై గన్నులు పట్టుకొని తిరిగేవాడు క్రిమినలా? లేక ప్రజలకు సేవ చేసే ముఖ్యమంత్రి క్రిమినలా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వస్తే కొడతాం.. అంటూ క్రిమినల్ లా మాట్లాడుతున్నారని, కానీ ఇప్పుడు జగన్ అధికారంలో ఉన్నారని, ఆయన కూడా మీలా ఆలోచిస్తే పవన్ చెప్పిందే వారికి జరగాలన్నారు. కానీ ముఖ్యమంత్రి గొప్ప మనసుతో ముందుకు సాగుతున్నారని, అందుకే మీరు బతికి బట్టకడుతున్నారన్నారు. జగన్ అంటే ఓ క్రియేటర్ అన్నారు.
1972 తర్వాత ఏ నాయకుడికి సాధ్యం కాని విధంగా 51 శాతం ఓట్లతో వన్ అండ్ ఓన్లీ జగన్ వైసీపీని గెలిపించారని, ఒంటి చేత్తో 86 శాతం సీట్లు సాధించారన్నారు. మరోసారి పవన్ ఇలా మాట్లాడితే ప్రజలే ఆయనను తరిమికొట్టే రోజు వస్తుందన్నారు. కరోనా సమయంలో చంద్రబాబు, పవన్, లోకేశ్ దొంగల్లా హైదరాబాద్ లో దాక్కుంటే, టీడీపీ కేడర్, జనసేన కేడర్ కు సేవ చేసింది ఈ వాలంటీర్లే అన్నారు.
ఇప్పుడు పవన్ సమావేశాలకు వచ్చి విజిల్స్ వేస్తున్న యువత ఇలా ఉందంటే అందుకు కరోనా సమయంలో వాలంటీర్లు చేసిన సేవే అన్నారు. వాలంటీర్లపై ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే పళ్లు రాలగొడతారన్నారు. 2024లోను జగనన్న వన్స్ మోర్.. బైబై బీపీ అని చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మంచిదన్నారు.