ఖమ్మం పాలిటిక్స్ రాజకీయ కాక రేపుతున్నాయి. తుమ్మల పార్టీ చేరిక ఇప్పుడు తాజా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గురువారం మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో కూడిన కాంగ్రెస్ నేతల బృందం సమావేశం అయింది. హైదరాబాద్‌లోని తుమ్మల నాగేశ్వర రావు ఇంటికి వెళ్లిన రేవంత్‌రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మల్లు రవి, ఇతర నాయకులు తుమ్మలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజులుగా ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. త్వరలోనే తుమ్మల నాగేశ్వరరావు హస్తం పార్టీలో చేరనున్నారు. ఇటీవలే తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌గూడెం నుంచి.. సుమారు 1000 కార్లు, 2000 బైక్‌లతో ఖమ్మం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎక్కడా బీఆర్ఎస్ జెండాలు కనిపించలేదు.
ర్యాలీలో కేవలం ఆయన ఫొటో ఉన్న ఫ్లెక్సీలు, జెండాలు మాత్రమే దర్శనమిచ్చాయి. అనంతరం ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని తెలిపారు. మీతో శభాష్ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ తలవంచే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. అవసరమైతే తల నరుక్కుంటా కానీ.. తలవంచనని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో తనను తప్పించానని కొందరు ఆనందపడొచ్చని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తాను ఎవరినీ నిందించ తలచుకోలేదని అన్నారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని పేర్కొన్నారు. కొందరు పరాన్నభుక్కులు కొన్ని ఎత్తులు వేయవచ్చని.. ఎందరో నేతల వల్ల కానివి.. తాను చేసి చూపించినట్లు తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు తుమ్మలతో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. దీంతో తుమ్మల నాగేశ్వరరావు త్వరలోనే హస్తం పార్టీలో చేరనున్నారు.
మరోవైపు ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో గెలిచేందుకు అవకాశం ఉన్న నేతలను.. సర్వేల ద్వారా దాదాపుగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గాల వారిగా హస్తం పార్టీకి బలమైన నాయకత్వం లేని నియోజకవర్గాలను పీసీసీ ఇప్పటికే గుర్తించింది. అసంతృప్తిగా ఉన్న నాయకులు సైతం బీఆర్ఎస్ నాయకత్వంపై కసితో ఉంటుండడంతో సీట్లను సర్దుబాటు చేసి టిక్కెట్లు ఇవ్వగలిగితే పార్టీకి ప్రయోజనం కలిగే అవకాశాలు ఉన్నట్లు హస్తం వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గత కొన్ని రోజులుగా రహస్య మంతనాలు జరుగుతున్న విషయం బయటకు పోకుండా అధిష్టానం జాగ్రత్త పడుతోంది.