మన శరీరంలోని ప్రతి భాగానికి ఓ ప్రత్యేకమైన విధి ఉంటుంది. శరీరంలో తలను, మొండెమును కలిపే విషయంలో మెడ ఎంతో కీలకంగా వ్యవహరిస్తుంది. వాహనాలు నడిపే వారికి, ఎక్కువ సేపు కంప్యూటర్ చూస్తూ పని చేసే వారికి.. తరుచుగా మెడ నొప్పి రావడాన్ని మనం గమనించవచ్చు. పొరపాటున ఈ మెడనొప్పి వస్తే.. ఏ పని చేయడానికి కూడా మనకు ఇబ్బందిగా ఉంటుంది.మెడనొప్పితో బాధ పడే వాళ్లు కాసేపు మెడను దిండు మీద పెడితే చాలు అనుకుంటారు. లేదంటే వేడినీళ్ల ఆవిరితో ఉపశమనం పొందవచ్చు అని అనుకుంటారు. అయితే ఇవన్నీ నొప్పిని కాస్త తగ్గించే మార్గాలే కానీ పూర్తిగా నొప్పిని నివారించే మార్గాలు కావని గుర్తించాలి.మెడనొప్పి ఎందుకు వస్తుందంటే?
మెడనొప్పి అనేది మెడ మీద ఎక్కువ భారం వేసినప్పుడు రావచ్చు. అలాగే అతిగా వ్యాయామం చేసినా రావచ్చు. వాహనాలు నడిపే సమయంలో కుదుపుల వల్ల, బరువులు ఎత్తే సమయంలో ఒత్తిడి వల్ల మెడ నొప్పి వచ్చేందుకు అవకాశం ఉంది. మెడలో సున్నితమైన కండరాలు ఉంటాయి. ఇవి ఒత్తిడికి లోనైనప్పుడు అది నొప్పికి దారితీస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మెడకు రక్తసరఫరా సరిగ్గా లేకపోయినా, మెడలోని డిస్క్‌లు కదిలినా.. నొడ నొప్పి సమస్య ఏర్పడవచ్చని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డా.మనోజ్ కుమార్ వివరించారు.మెడనొప్పి వస్తే ఏం చేయాలంటే?
సాధారణంగా చిన్న వయస్సు వారిలో మెడనొప్పి వస్తే ఎలక్ట్రోరల్ వాటర్ తీసుకోవడం, కొబ్బరి నీళ్లు తాగడం, హాట్ బ్యాగ్స్ వాడటం వల్ల ఉపశమనం పొందవచ్చు. మధ్య వయస్సువారు.. వాహనం నడిపేవాళ్లు, కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం కూర్చునే వాళ్లు నెక్ సపోర్ట్ వాడటం వల్ల లాభం కలుగుతుంది.మెడనొప్పి నివారణకు ఏం చేయవచ్చు?
కంప్యూటర్ ముందు ఎక్కువసేపు కూర్చొని పని చేసే వాళ్లు ప్రతి 40 నిమిషాలకు ఒకసారి లేచి, విశ్రాంతి తీసుకోవడం అవసరం. అలాగే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ కళ్లకు సమానమైన ఎత్తులో ఉండేలా చూసుకోవడం మంచిది. ఒకే భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం, లేదంటే పడుకోవడం వల్ల కూడా ఇలాంటి సమస్య తలెత్తుతుంది. కనుక మీ శరీర భంగిమలను తరచూ మార్చడం మంచిది. అలాగే వ్యాయామం చేయడం వల్ల కూడా మెడనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.మెడ నొప్పి రావడానికి గల ఇతర కారణాలు
మెడకు తగినంత రక్తం సరఫరా కాకపోవడం, ఆస్టియోఫోరోసిస్ లాంటి సమస్య ఉన్నప్పుడు కూడా మెడనొప్పి రావచ్చని వైద్యులు అంటున్నారు. మెడ భాగం చాలా సున్నితంగా ఉంటుంది. కనుక మెడ నొప్పి సమస్య ఎక్కువగా ఉంటే.. వైద్యులను సంప్రదించడం మంచిది. ఒక వేళ దీర్ఘకాలికంగా మెడ నొప్పి ఉంటే.. అది ఇతర ఆరోగ్య సమస్యలకు సంకేతంగా కూడా భావించాల్సి వస్తుంది.. కనుక ఇలాంటి సందర్భాల్లో కచ్చితంగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.