ఇటీవలి కాలంలో స్టాక్ మార్కెట్‌లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల జోరు కనిపిస్తోంది. దీని ప్రభావం ఆగస్టు 4తో ముగిసిన వారంలో విదేశీ మారకద్రవ్య నిల్వలు భారీగా తగ్గుముఖం పట్టాయి. విదేశీ మారకద్రవ్య నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 601.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో కూడా విదేశీ మారక ద్రవ్య నిల్వల గణాంకాలు తగ్గుముఖం పట్టాయి.
విదేశీ మారక నిల్వల డేటాపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ ఏడాది ఆగస్టు 4తో ముగిసిన వారంలో భారతదేశ ఫారెక్స్ నిల్వలు 2.41 బిలియన్ డాలర్లు తగ్గి 601.45 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఈ కాలంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.93 బిలియన్ డాలర్లు తగ్గి 533.40 బిలియన్ డాలర్లకు తగ్గాయి. ఆర్‌బీఐ బంగారం నిల్వలు కూడా తగ్గి 224 మిలియన్ డాలర్లు తగ్గి 44.68 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఐఎంఎఫ్ వద్ద నిల్వలు 86 మిలియన్ డాలర్లు తగ్గి 5.09 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి.
గత రెండు వారాలుగా విదేశీ ఇన్వెస్టర్లు భారత స్టాక్ మార్కెట్‌లో అమ్మకాలు జరుపుతున్నారు. దీని కారణంగా డాలర్‌కు డిమాండ్ పెరిగింది. ఆర్‌బీఐ వద్ద డాలర్ నిల్వలు తగ్గడానికి ఇదే కారణం. దిగుమతిదారుల నుంచి డాలర్లకు డిమాండ్ పెరగడంతో నిల్వలు తగ్గాయి. శుక్రవారం ఆగస్టు 11, 2023 నాడు డాలర్‌తో రూపాయి 14 పైసలు క్షీణించి రూ. 82.84 వద్ద ముగిసింది. ఇటీవలి కాలంలో డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడింది. విదేశీ మారకద్రవ్య నిల్వలు ఇప్పటికీ 600 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగానే ఉండడం ఊరటనిచ్చే అంశం. అక్టోబర్ 2021లో భారతదేశ విదేశీ మారక నిల్వలు 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.