అన్నా చెల్లెళ్ళ బంధం విడదీయరానిది. చెల్లెకు ఎప్పుడు అన్న తోడుగానే ఉంటాడు. అలాగే చెల్లెలు ఎప్పుడూ అన్నయ్య శ్రేయస్సునే కోరుకుంటుంది. ఒకే గర్భం నుంచి రక్తం పంచుకొని పుట్టిన వీరు చచ్చేవరకు ఒకరిపై ఒకరు అన్యోన్యమైన అభిమానాన్ని చాటుతూనే ఉంటారు. వీరిద్దరి బంధానికి ప్రతీకే రాఖీ పూర్ణిమ. ఇలాంటి బంధానికి అద్దం పడుతూ రక్షాబంధన్ సందర్భంగా ఓ అక్క కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న తన తమ్ముడికి రాఖీ కట్టింది. అంతే కాదు.. అతడు కోలుకునేందుకు తన వంతుగా కిడ్నీ దానం చేస్తున్నట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పుర్ నగరానికి చెందిన ఓం ప్రకాశ్ ధన్‌గర్‌కు గతేడాది మేలో కిడ్నీ దెబ్బతినింది. దాంతో తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒక కిడ్నీ 80%, మరో కిడ్నీ 90% దాకా క్షీణించినట్లు గుర్తించిన వైద్యులు వెంటనే కిడ్నీ మార్పిడి చేయించుకోవాలని ఆయనకు సూచించారు. లేని పక్షంలో ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించారు.
దీంతో ఓం ప్రకాశ్ కుటుంబ సభ్యులు గుజరాత్ రాష్ట్రం నడియాడ్‌లోని ఓ ఆస్పత్రిని సంప్రదించారు. అక్కడి వైద్యులు సైతం కిడ్నీ మార్పిడి తప్పనిసరి అని తేల్చి చెప్పారు. ఎవరైనా దాతలు ఉంటే ఆపరేషన్‌కు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఈ విషయం ఓం ప్రకాశ్.. అక్క సుశీలాబాయ్ పటేల్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆమె తన తమ్ముడికి కిడ్నీ దానం ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. వైద్యులు ఆమెకు అవసరమైన వైద్య పరీక్షలన్నీ నిర్వహించారు. అనంతరం దాత కిడ్నీ.. మార్పిడికి సరిపోతుందని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 3న కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరగబోతోంది. ప్రస్తుతం సుశీలాబాయ్, ఓం ప్రకాశ్ గుజరాత్‌లోని ఆస్పత్రిలో ఉన్నారు. నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సుశీల తన సోదరుడికి రాఖీ కట్టి.. నిండు నూరేళ్లు క్షేమంగా ఉండాలని దీవించింది. తమ్ముడు ఓం ప్రకాశ్ అంటే తనకు ఎంతో ప్రేమ అని.. అందుకే కిడ్నీ దానానికి సిద్ధపడ్డానని సుశీల తెలిపింది.