పబ్జీ ఆట ద్వారా పరిచయం చేసుకొని ప్రేమికుడి కోసం అక్రమంగా ఇండియా లోకి ప్రవేశించిన పాక్ జాతీయురాలు సీమా హైదర్ ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ తదితర ప్రముఖులకు రక్షా బంధన్ సందర్బంగా రాఖీలు పంపారు. ఈ నెల 30న రాఖీ పూర్ణిమ పండుగ ఉన్నందునవారందరికీ తాను రాఖీలు పంపానని ఆమె ఓ వీడియో సందేశంలో వెల్లడించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు సైతం రాఖీలు పంపించినట్లు ఆమె పేర్కొన్నారు. నేను ముందస్తుగా రాఖీలను పోస్టులో పంపించాను. ఈ దేశ బాధ్యతలను భుజాలకెత్తుకున్న నా సోదరులకు అవి సకాలంలో చేరుతాయి. అందుకు నేను చాలా సంతోషిస్తున్నా. జై శ్రీరాం. జై హింద్, హిందుస్థాన్ జిందాబాద్’ అంటూ హైదర్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
మరో వీడియోలో సీమా హైదర్ తన పిల్లలతో కలిసి రాఖీలను ప్యాక్ చేస్తూ కనిపించింది. ‘భయ్యా మేరే రాఖీ కే బంధన్ కో నిభానా’ అనే రక్షాబంధన్ పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తోంది. పబ్జీ ఆట ద్వారా పరిచయమైన తన ప్రియుడు సచిన్ మీనాతో కలిసి జీవించేందుకు సీమా హైదర్ పాక్ నుంచి భారత్ వచ్చింది. ఆమె నేపాల్ సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి ప్రవేశించినట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో ఆమెను జులై 4న అరెస్టు చేయగా.. స్థానిక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం సీమా తన నలుగురు పిల్లలు, సచిన్‌తో కలిసి గ్రేటర్ నోయిడాలో నివాసం ఉంటోంది. పోలీసులు, ఉత్తర్‌ప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందాలు విడివిడిగా సీమా కేసును దర్యాప్తు చేస్తున్నాయి.