తెలంగాణలోని సిద్దపేట, సిరిసిల్ల, కరీంనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైలు(Train) ఇవాళ సిద్దిపేటకు రానున్నది. సీఎం కేసీఆర్(CM KCR) దశాబ్దాల కల సాకారం కానున్నది. మంగళవారం మధ్నాహ్నం 3 గంటలకు సిద్దిపేట రైల్వేస్టేషన్‌లో మంత్రి హరీశ్‌రావు(Minister Harish Rao) రైలును ప్రారంభించనున్నారు. మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపడుతున్న రైల్వేలైన్ పనులు స్వరాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గజ్వేల్ వరకు పనులు పూర్తయి రైలు సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిద్దిపేట వరకు రైల్వేలైన్ నిర్మాణం(Construction of railway line) పూర్తయింది. దాంతో మంగళవారం నుంచి సిద్దిపేట-కాచిగూడకు రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. కాగా, మనోహరాబాద్-సిద్దిపేట రైల్వేస్టేషన్ల మధ్య నూతన రైలు మార్గాన్ని మంగళవారం ప్రధాని మోదీ వర్చువల్‌గా జాతికి అంకితం చేస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూల్ రైల్వేస్టేషన్ల మధ్య విద్యుదీకరణను కూడా ప్రారంభిస్తారని తెలిపారు.
2005-06లో యూపీఏ ప్రభుత్వంలో కేసీఆర్ కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పు డు రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటాగా మొత్తం ఖర్చు భరించి భూసేకరణ, రైల్వే ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో మూడో వంతు సమకూర్చడం, రైల్వే నిర్మాణం అనంతరం ఐదేండ్లపాటు రైల్వేకు వచ్చే నష్టాలను రాష్ట్ర ప్ర భుత్వం భరించడం అనే అగ్రిమెంట్‌తో మనోహరాబాద్ నుంచి గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల, వేములవాడ మీదుగా కొత్తపల్లి కరీంనగర్ వరకు 151 కిలోమీటర్ల రైల్వేలైన్ మంజూరు చేయించారు. నాటి వైఎస్ ప్రభుత్వం రాష్ట్రం వాటాగా నిధులు చెల్లించకపోవడం, భూసేకరణ చేయకపోవడం మూలంగా 2014 వరకు రైల్వే ఏర్పాటు పనులు ప్రారంభం కాలేదు.
2014లో తెలంగాణ రాష్ట్రాన్ని(Telangana state) సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం కేసీఆర్ మనోహరాబాద్-కొత్తపల్లి(Manoharabad-Kottapalli) రైల్వేలైన్ ఏర్పాటుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2,200 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు ఇవ్వడం వల్ల దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా సిద్దిపేట రైల్వేలైన్ పూర్తయింది. దేశంలో ప్రథమంగా ఒక కోర్టు కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.1000 కోట్ల వరకు వెచ్చించింది. రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర పర్యవేక్షణ, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక కృషితోనే ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తయింది.