ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కేసులో లోక్‌సభ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించారు. దీంతో ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా ప్రసంగించారు. ఈ క్రమంలో తాజాగా రక్షణశాఖపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి ఎంపికయ్యారు. మార్చి నెలలో సభ్యత్వం కోల్పోకముందు కూడా రాహుల్ ఈ కమిటీలోనే సభ్యుడిగా ఉన్నారు. ఇందులోకి కాంగ్రెస్ ఎంపీ అమర్ సింగ్ కూడా నామినేట్ అయినట్లు లోక్‌సభ బులిటెన్ వెల్లడించింది.
లోక్‌సభకు కొత్తగా ఎన్నికైన ఆమ్‌ఆద్మీ తరఫు ఎంపీ సుశీల్ కుమార్ రింకూ.. వ్యవసాయం, పశుసంవర్ధక, ఫుడ్ ప్రాసెసింగ్ స్టాండింగ్ కమిటీకి ఎంపికయ్యారు. ఇటీవల జలంధర్ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో రింకూ ఎన్నికయ్యారు. ఇక మార్చి నెలలో లోక్‌సభ సభ్యత్వం తిరిగి పొందిన ఎన్‌సీపీ ఎంపీ ఫైజల్ మొహమ్మద్.. వినియోగదారుల వ్యవహారాల స్టాండింగ్ కమిటీకి నామినేట్ అయ్యారు. మరోవైపు 2019లో ‘మోదీ ఇంటి పేరుపై చేసిన వ్యాఖ్యల కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో ఈ ఏడాది మార్చి 24న రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయారు. అయితే, ఆయనకు దిగువస్థాయి కోర్టు విధించిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో రాహుల్ సభ్యత్వాన్ని ఆగస్టు 7న పునరుద్ధరించారు. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంటు సమావేశాల్లో పాల్గొని.. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించారు.
మోదీ ఇంటి పేరు కలిగినవారంతా దొంగలేననే అర్ధం వచ్చేలా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు మార్చ్ 23న కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది. అయితే తీర్పు వెలువడే ముందు కోర్టు ఎదుట హాజరైన రాహుల్ తన ఉద్దేశం సరైందేనని, దురుద్దేశంతో తాను మోదీ ఇంటిపేరుపై వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన ప్రశ్నించారు. దీనిపై గుజరాత్ బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లారు. రాహుల్‌పై పరువునష్టం కేసు వేశారు. ఈ కేసులో నేడు విచారణ జరిపిన సూరత్ కోర్టు రాహుల్‌ను దోషిగా తేల్చింది. ఈ మేరకు రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించింది. రాహుల్‌కు రెండేండ్ల జైలు శిక్ష విధించిన వెంటనే ఆయన లీగల్ టీం బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు రాహుల్‌కు బెయిల్ మంజూరు చేసింది.