ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఒకటైన పైథాన్‌కు మార్కెట్లో డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఐటీలో దీటైన కెరియర్‌ను నిర్మించుకోవాలి అనుకునేవారికి పైథాన్ నేర్చుకోవడం ఒక అదనపు అర్హతగా మారింది. మరి ఈ కోర్సు విషయాలేంటో తెలుసుకోండి..
సీ, జావాలతో పోలిస్తే పైథాన్ ప్రోగ్రామ్స్ చిన్నవిగా ఉంటాయి. దీని సింటాక్స్ కూడా సులువుగా అర్థమయ్యేలా ఉంటుంది. ఈ ప్రోగ్రాం కోడ్ సులువుగా ఆంగ్లంలోనే ఉండటంతో పాటు చాలా వరకూ అర్ధం అవుతుంది. కానీ, ఈ ప్రోగ్రామ్ రన్ అయ్యేందుకు ఎక్కువ సమయం పడుతుండటంతో దీని ఉపయోగం కొంత తగ్గినా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డేటాసైన్స్.. వంటి రంగాలకు డిమాండ్ పెరగటంతో ఇందులో వినియోగించే పైథాన్ లాంగ్వేజ్‌కు కూడా ఆదరణ పెరిగింది.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక డిమాండ్ ఉన్న ప్రోగ్రామ్స్‌లో పైథాన్ ఉంది. ఇది శక్తిమంతమైనదే కాక, ఉపయోగించేందుకు తేలికైనది కూడా. భద్రత కలిగి ఉండటం దీంతో లభించే మరో ప్రయోజనం. ఇదో క్రాస్ ఫ్లాట్‌ఫాం, ఓపెన్ సోర్స్ లాంగ్వేజ్. అంటే ఒక ప్లాట్‌ఫాంలో అభివృద్ధి చేసిన కోడ్‌ను మరో ప్లాట్‌ఫాంలో సులభంగా ఉపయోగించవచ్చు. విండోస్, మాక్, లైనక్స్… ఇలా ఎందులోనైనా కోడ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీనిలో డైనమిక్ కోడింగ్ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా డేటా సైన్స్‌లో పైథాన్ వాడకం ఎక్కువగా ఉంది. డేటా సైన్స్‌లో ఉపయోగించేందుకు వీలుగా ఉండే స్పెషల్ లైబ్రరీలు ఇందులో అధికంగా ఉండటమే దీనికి కారణం. నంపై, పాండాస్, స్కైపై, సెలీనియం, ఓపెన్ సీవీ, లిబ్రోసా, మాడ్‌మామ్, టెన్సర్‌ఫ్లో, సీబోర్న్, పిల్లో వంటి లైబ్రరీలతో కోడర్స్ పని మరింత సులభమవుతుంది.
ఉపయోగాలేంటి..
డెస్క్‌టాప్ అప్లికేషన్లు, మొబైల్ అప్లికేషన్లు, వీడియో గేమ్స్, వెబ్ యాప్స్, క్లౌడ్ – బేస్డ్ యాప్స్, వెబ్ ఫ్రేమ్ వర్క్స్, జీయూఐ (గ్రాఫికల్ యూజర్ ఇంటర్‌ఫేస్) బేస్డ్ సాఫ్ట్‌వేర్లు, వీఆర్ అండ్ ఏఆర్… ఇలా దేనికైనా పైథాన్‌ను ఉపయోగించచ్చు. గూగుల్ తన వినియోగదారులకు మెరుగైన ఫలితాలు అందించేందుకు పైథాన్‌ను వినియోగిస్తోంది. క్లౌడ్ ప్లాట్‌ఫాం డ్రాప్‌బాక్స్‌లో సర్వర్, క్లైంట్ అప్లికేషన్లను దీని సాయంతోనే తయారుచేశారు. నెట్‌ఫ్లిక్స్‌లో మెషిన్ లెర్నింగ్ ద్వారా వీక్షకుల ఆసక్తిని గమనించి, వారిని క్లస్టర్లుగా విభిజించి షోలను రికమెండ్ చేసేందుకూ పైతాన్‌నే ఉపయోగిస్తున్నారు. అలాగే యూట్యూబ్, మొజిల్లా, మైక్రోసాఫ్ట్, సిస్కో, క్వారా, ఫేస్‌బుక్ వంటి ప్రముఖ సంస్థలు ఈ లాంగ్వేజ్‌ను ఉపయోగిస్తున్నాయి.
ఉద్యోగావకాశాలు..
పైతాన్ డెవలపర్స్‌కు ఇప్పుడు అధికంగా డిమాండ్ ఉండటం వల్ల వీరికి పూర్తి ఉద్యోగ భద్రత ఉంది. ఐటీలో అత్యధిక వేతనాలు అందుకుంటున్నవారిలో వీరు కూడా ఉన్నారు. వెబ్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్రేమ్ వర్క్స్, వెబ్ టెస్టింగ్, గేమ్ డెవలప్‌మెంట్, బిగ్ డేటా, స్మార్ట్ డివైజెస్ – ఐవోటీలో పైతాన్ నిపుణులకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. మరింత మంది ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా తమ కెరియర్‌కు అదనపు వేగాన్ని జోడించవచ్చు.