పురుషోత్తమ క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరీ క్షేత్రానికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాచలం, నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి. పూరీ అంటే పూరించేదని అర్థం. భక్తుల కోర్కెలు తీర్చే దివ్యక్షేత్రం కావడంతో పూరీ అనే పేరు జగన్నాథుడి కరుణా కటాక్షానికి పర్యాయ పదమైందని భక్తుల విశ్వాసం. సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథుడు ఇక్కడ కొలువయ్యాడు. 1078 సంవత్సరంలో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ నిర్మాణం ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తైంది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని చెబుతారు. ఈ ఆలయంలో అణువణువూ మిస్టరీనే. అవేంటో చూద్దాం.
1800 ఏళ్ల నుంచి జరుగుతున్న ఆచారం
45 అంతస్తుల ఎత్తు గల ఈ ఆలయంపైకి ప్రతి రోజూ ఓ పూజారి ఎక్కి జెండాను క్రమం తప్పకుండా మారుస్తుంటారు. ఈ ఆచారం దాదాపు 1800 ఏళ్ల నుంచి జరుగుతుంది. ఇది ఒక్క రోజు తప్పినా అప్పటి నుంచి 18 ఏళ్ల వరకూ ఆలయం మూతపడుతుందని నమ్ముతారు. అంతేగాక ఈ గోపురంపైన ఉన్న జెండా గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటుంది.
చక్రం
పూరీ జగన్నాథ్ ఆలయం గోపురంపై సుదర్శన చక్రం ఉంటుంది. ఎవ్వరైనా పూరీలో ఎక్కడినుంచి చూసిన ఈ చక్రం వారివైపే తిరిగి ఉన్నట్టు కనిపిస్తుంది. అదీ ఆ చక్రం ప్రత్యేకత.
దేవుడి ప్రసాదం
పూరీ జగన్నాథుడికి 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఆ ప్రసాదాలను ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో తయారు చేస్తారు. కానీ ఎప్పుడూ వృధాకాదు, భక్తులకు సరిపోకపోవడం అనేది జరగదు. ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు. కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పై భాగంలో ఉన్న కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం.
రథ యాత్ర
భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ రథ యాత్ర కోసం గర్భ గుడిలోని సుభద్ర, బలరామ, జగన్నాథుడి విగ్రహాలు ఆలయం వెలుపలికి వస్తాయి. ఈ యంత్రం మొత్తం 12 రోజుల పాటు జరుగుతుంది. ఈ యాత్రలో వూరేగించేందుకు ఏటా కొత్త రథాలను నిర్మిస్తారు. రథ యాత్రకు ముందు పూరీ సంస్థానాధీశులు బంగారు చీపురుతో రథాల ముందు ఊడ్చుతారు. ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు.