బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ట్విట్టర్ వేదిక వైసీపీ ప్రభుత్వంపై వరుసగా ట్విట్టస్త్రాలు సంధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ.. ఏపీలో సర్పంచులు ఉత్సవ విగ్రహాలుగా మారారు. కేంద్రం పంచాయతీలకిచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లించింది. గ్రామాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు వదిలింది. నాలుగున్నరేళ్ల కాలంలో రూ. 8600 కోట్లు ఏపీలోని గ్రామాలకు కేంద్రం ఇచ్చింది. సర్పంచులు అప్పులు చేసి పనులు చేస్తున్నా.. బిల్లులు రావడం లేదు. కొందరు సర్పంచులు అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కేంద్ర నిధుల వాటాతో జరిగే అభివృద్ధి పనులు చేసే కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటూ.. ముడుపులిచ్చిన వారికి గ్రీన్ ఛానెల్ ద్వారా బిల్లులు చెల్లిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎన్జీటీ అభ్యంతరాలతో ఆపేసినా.. ఆ కాంట్రాక్టరుకు గ్రీన్ ఛానెల్ ద్వారా రూ. 800 కోట్లు ఇచ్చేశారు. ఈ నెల పదో తేదీన అన్ని జిల్లాల్లో సర్పంచులకు అండగా కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేపడతాం.’ అని ఆమె ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
ఇదేకాకుండా.. రాష్ట్ర ప్రభత్వం గ్రామ పంచాయితీల నిర్వహణకు కేంద్రం ఇచ్చిన నిధులు మళ్ళించి సర్పంచ్ లు ఆత్మహత్యకు పాల్పడే స్థాయికి కారణభూతమైనటువంటి పరిస్థితులు, వేలాదిమంది కాంట్రాక్టర్లు అప్పుల ఊబిలో కోరుకుపోయి ప్రభుత్వ నిధులు రాక తిప్పలు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర బిజెపి ఈనెల 10 వ తారీఖున కలెక్టరేట్ల ముందు నిర్వహించనున్న ఆందోళన కార్యక్రమాన్ని వివరిస్తూ… ప్రజల సంఘీభావాన్ని కోరుతూ పురంధేశ్వరి వీడియో పోస్ట్ చేశారు.
అంతేకాకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కారాదు. హిందూ ధర్మం పై నమ్మకమున్నవాళ్లే ఈ పదవికి న్యాయం చేయగలరు. ఇంతకు ముందు ఈ ప్రభుత్వం 80 మంది సభ్యులతో ధర్మకర్తల మండలి నియామకం చేయడం జరిగింది. ఈ విషయం పై గలం విప్పిన తరువాత 52 మంది నియామకం నిలిపి వేయడం జరిగింది. అంటే ప్రభుత్వం ఈ నియామకాలను రాజకీయ పునరావాస నియామకాలుగానే పరిగణిస్తున్నదని అర్ధమవుతున్నది. కనుక టీటీడీ చైర్మన్ పదవికి హిందూ ధర్మం పై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్ళని నియమించాలి.’ అని ఆమె అన్నారు.