కొంతకాలంగా పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు ముదిరింది. ముఖ్యమంత్రికి గవర్నర్ శుక్రవారం గట్టి హెచ్చరికలు జారీ చేశారు. గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తానని హెచ్చరించారు. అంతే కాకుండా క్రిమినల్ చర్యలకు ఉపక్రమిస్తానని కూడా వెల్లడించారు. గతంలో రాసిన లేఖలపై సర్కారు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంపై కలత చెందినట్టు గవర్నర్ పేర్కొన్నారు. రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనంటూ హెచ్చరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం.. తాను తుది నిర్ణయం తీసుకోవడానికి ముందే లేఖలపై సమాధానం ఇవ్వాలని ముఖ్యమంత్రికి గవర్నర్ పురోహిత్ సూచించారు. ఈమేరకు ఆయన సీఎం భగవంత్ మాన్‌కు పంపిన లేఖను మీడియాకు విడుదల చేశారు.
తన లేఖలలో, పంజాబ్ గవర్నర్ సరిహద్దు రాష్ట్రంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ప్రశ్నలు లేవనెత్తారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి గవర్నర్ అడిగారు. మత్తుపదార్థాల లభ్యత, వినియోగంపై వివిధ ఏజెన్సీల నుంచి నివేదికలు అందాయని, ఫార్మసీలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం దుకాణాల్లో కూడా అవి ఎలా దొరుకుతాయన్న ఆరోపణలు సర్వసాధారణమైపోయాయని గవర్నర్ లేఖలో పేర్కొన్నారు. పంజాబ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికను గవర్నర్ ఆ లేఖలో తెలిపారు. అలాగే, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సమస్యకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న చర్యలపైనా సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఉండదన్నారు.
గవర్నర్ హెచ్చరికపై స్పందించిన ఆప్ నేత మల్వీందర్ సింగ్ కాంగ్.. తమది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమని.. ఇలా ఎన్నుకోబడిన వ్యక్తులకు భారత రాజ్యాంగం అధికారం ఇస్తుందని అన్నారు. గవర్నర్ ఇలా రాష్ట్రపతి పాలన విధించే బెదిరింపులు, హెచ్చరికలు చేయడంతో బీజేపీ అజెండాను గవర్నర్ బయటపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి పాలన విధించాలంటే మణిపూర్‌లో, హర్యానాలో విధించాలని గవర్నర్‌కు చెప్పాలనుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి ఇతర ప్రతిపక్షాల పాలిత రాష్ట్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వ పనితీరులో గవర్నర్‌లు జోక్యం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.