టీడీపీ అధినేత చంద్రబాబు కు బిగ్ షాక్ తగిలింది. పుంగనూరు అల్లర్లలో చంద్రబాబు పై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పుంగనూరులో చెలరేగిన అల్లర్లలో చంద్రబాబు పై అన్నమయ్య జిల్లా ముదివీడు పోలీసు స్టేషన్ లో డాక్టర్ ఉమాపతి రెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2 దేవినేని ఉమా, ఏ3 అమర్నాథ్ రెడ్డి కేసు నమోదు అయింది.అంతేకాకుండా ఎఫ్ఐఆర్ లో మరో 20 మంది పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో చిన్నగా మొదలైన ఘర్షణ వాతావరణం చివరకు పెద్దదైపోయింది. దాదాపు మూడు గంటలపాటు రెండు పార్టీల నేతలు, శ్రేణులు ఒకళ్ళపై మరొకళ్ళు రాళ్ళతో దాడులు చేసుకున్నారు. కర్రలతో కొట్టుకున్నారు. అడ్డొచ్చిన పోలీసులకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. 14 మంది పోలీసులకు తీవ్రమైన గాయాలైనట్లు సమాచారం. అలాగే రెండు పార్టీల్లోని వాళ్ళకి కూడా గాయాలయ్యాయి.
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చంద్రబాబుకు ఏమాత్రం పడటంలేదు. ఇద్దరి మధ్య హై ఓల్టేజీలో మాటల యుద్ధం జరుగుతోంది. ఇదే సమయంలో పుంగనూరులోకి ప్రవేశించిన చంద్రబాబు నేతలు, క్యాడర్‌ను రెచ్చగొట్టారట. తరమండి..కొట్టండి అంటూ కార్యకర్తలను ఉసిగొల్పారని వార్తలొస్తున్నాయి. పుంగనూరు హైవే మీదుగా ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చంద్రబాబు చిత్తూరుకు వెళ్లిపోయి ఉంటే అసలు గొడవే జరిగేదికాదు. సడెన్‌గా పుంగనూరు టౌన్లోకి రావాల్సిన అవసరం చంద్రబాబుకు ఏమొచ్చిందని ప్రభుత్వ పెద్దలు ప్రశ్నిస్తున్నారు.