ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఒకేఒక్క పేరు ప్రాజెక్ట్ కె. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీ దత్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కమల్ హాసన్ విలన్ గా నటిస్తుండగా.. అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రిలీజైన ప్రీ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రాజెక్ట్ కె అనేది కేవలం వర్కింగ్ టైటిల్ మాత్రమే అని.. ఒరిజినల్ టైటిల్, టీజర్, రిలీజ్ డేట్ ను జూలై 20 న కాలిపోర్నియాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్-కాన్ వేడుకలో రిలీజ్ చేయనున్నారు. అయితే ముందు నుంచి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారని తెలిసిందే.
ఇకపోతే అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా వచ్చే అవకాశాలు లేవని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదట. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతుంది. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్ ఉండనున్నాయట. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో.. గ్రాఫిక్స్ పై మేకర్స్ ఫోకస్ చేశారట. దీంతో అన్ని పర్ఫెక్ట్ గా చేయడానికి నాగ అశ్విన్ బాగా కష్టపడుతున్నాడట. అందుకే కొద్దిగా ఆలస్యమైనా పర్లేదని నాగీ.. ప్రాజెక్ట్ కె ను ఒక శిల్పంలా చెక్కుతున్నాడని టాక్ నడుస్తోంది. ఇక ఇదే కనుక నిజమైతే ప్రభాస్ ఫ్యాన్స్ కు ఇది ఖచ్చితంగా చేదువార్తే అని చెప్పాలి. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.