పాత పార్లమెంట్ భవనం చారిత్రక ఘట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రస్తావించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన రాజ్యాంగం ఈ సెంట్రల్ హాల్‌లోనే రూపుదిద్దుకుందని గుర్తు చేశారు. ఆంగ్లేయుల నుంచి రాజ్యాధికారం అందుకున్నది కూడా ఈ సెంట్రల్ హాల్(Central Hall)లోనే గతనాటి జ్ఞాపకాలను ప్రధాని మోదీ నెమరు వేసుకున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్(Parliament Central Hall)లో సమావేశం ఎంతో భావోద్వేగంతో కూడుకున్నదని తెలిపారు.
ఎన్డీఏ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారత్‌లో కొత్త చైతన్యం వస్తోందని వెల్లడించారు. పార్లమెంట్ పాత భవనంలోని లోక్సభ సెంట్రల్ హాల్లో చివరిసారిగా ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) ప్రసంగించారు. “తీవ్రవాద వ్యతిరేక చట్టాలు, ట్రిపుల్ తలాక్ చట్టాలను ఇక్కడే ఆమోదించుకున్నాం. ఆర్టికల్ 370 నుంచి విముక్తి కూడా ఈ పార్లమెంట్ ద్వారానే జరిగింది. ఇక్కడి నుంచే 4 వేలకు పైగా చట్టాలను ఆమోదించుకున్నాం. 1952 నుంచి 41 మంది వివిధ దేశాధ్యక్షులు ఇక్కడి నుంచి ప్రసంగించారు. రాష్ట్రపతులు 86 సార్లు ఈ సెంట్రల్ హాల్ నుంచి ప్రసంగించారు. ” అని మోదీ తెలిపారు.
మనం ఎంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటామో అంత వేగంగా ఫలితాలు వస్తాయన్నారు ప్రధాని. సాంకేతికతను అందించడంలో మన దేశ యువత ముందువరుసలో ఉందని తెలిపారు. యూపీఐ, డిజిటల్ టెక్ వంటి సాంకేతికతలతో దేశం దూసుకెళ్తోందని పేర్కొన్నారు. కాలం చెల్లిన చట్టాలకు చరమగీతం పాడి కొత్త చట్టాలను స్వాగతించాలని సభ్యులకు సూచించారు మోదీ. పార్లమెంటులో జరిగే ప్రతిచర్చ దేశ ఆకాంక్షలను ప్రతిబింబించాలన్నారు. మనం తెచ్చే సంస్కరణలు దేశవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలని తెలిపారు.”చిన్న పటంలో పెద్ద చిత్రాన్ని గీయలేం. పెద్ద నిర్ణయాలు తీసుకోకుండా పెద్ద మార్పులు తీసుకురాలేం. భవిష్యత్ తరాల కోసం నవ్య, దివ్య సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనపై ఉంది. మన యూనివర్సిటీలు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉండాలి. 1500 ఏళ్ల క్రితమే ప్రపంచంలోనే అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు భారత్‌లో ఉండేవి. జీ20 సమావేశాల్లోనూ నలంద విశ్వవిద్యాలయాల చిత్రాలు ప్రదర్శించాం.” అని మోదీ వ్యాఖ్యానించారు.