దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22 నుంచి 24 వరకు జరగనున్న “బ్రిక్స్” కూటమి 15వ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ మంగళవారం ఉదయం బయలుదేరి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా సోమవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి కారణంగా గత మూడు సంవత్సరాలుగా వర్చువల్‌గా జరిగిన “బ్రిక్స్” మీటింగ్స్.. ఈసారి మాత్రం ప్రత్యక్షంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. బిజినెస్ ట్రాక్స్ సమావేశాలు, బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్, బ్రిక్స్ ఉమెన్ బిజినెస్ అలయన్స్, బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ సమావేశాల్లో పాల్గొనేందుకు భారత్ నుంచి వ్యాపార ప్రతినిధి బృందం దక్షిణాఫ్రికాకు వెళ్తోందని చెప్పారు. “బ్రిక్స్” సదస్సు ముగియగానే.. ఆగస్టు 25న ప్రధాని గ్రీస్ పర్యటనకు వెళ్తారని తెలిపారు.
ఇక మరోవైపు ఈ వేదిక మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భేటీ కానున్నారు. ఇరువురు నేతలు చివరిసారి గతేడాది నవంబర్‌లో బాలి (ఇండోనేసియా)లో జరిగిన జీ20 సదస్సులో మాట్లాడుకున్నారు. అంతకుముందు ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ సదస్సులో మాత్రం ఇద్దరు నేతలు పలకరించుకోకపోవడం గమనార్హం.
అంతర్జాతీయ వ్యవహారాలపై పాశ్చాత్య దేశాల ఆధిపత్యానికి సవాలు చేసే భౌగోళిక రాజకీయ శక్తిగా ఎలా ఎదగాలనే విషయంపై చర్చించేందుకు బ్రిక్స్ దేశాలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో జొహాన్నెస్‌బర్గ్ వేదికగా ఆగస్టు 22-24 తేదీల్లో సమావేశం కానున్నాయి. అయితే, ఈ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్ వ్యక్తిగతంగా పాల్గొనడం లేదని దక్షిణాఫ్రికా ఇటీవలే వెల్లడించింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంటు ఉండటం.. దక్షిణాఫ్రికా వెళ్తే అరెస్టు తప్పదనే భయంతో పుతిన్ ఇందుకు దూరంగా ఉన్నారు. దీంతో రష్యా అధ్యక్షుడు మినహా.. బ్రిక్స్ సభ్యదేశాధినేతలు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.
బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా సభ్యదేశాలుగా ఉన్న ఈ కూటమి.. 2019 తర్వాత తొలిసారి ముఖాముఖీగా భేటీ అవుతోంది. సభ్యదేశాల్లో ఒకటైన రష్యా.. ఉక్రెయిన్‌పై ఏడాదిన్నరగా యుద్ధం చేయడం, దక్షిణాఫ్రికా ఆర్థిక పరిస్థితి దిగజారుతుండటం, భారత్-చైనాల మధ్య పలు అంశాల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న సమయంలో ఈ సభ్యదేశాలన్నీ భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.