తయారీలోనే ప్రత్యేకత మూటగట్టుకున్న తెలంగాణ కూజా (సురాయి).. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాకు కానుకగా దక్కింది. ఆయన భార్య షెపో మొత్సొపెకు నాగాలాండ్ శాలువా బహుమతిగా అందింది. జొహన్నె్‌సబర్గ్‌లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ వీటిని భారత దేశం తరఫున ఆతిథ్య దక్షిణాఫ్రికా అధ్యక్ష దంపతులకు కానుక కింద ఇచ్చారు. ఇదే సదస్సులో పాల్గొన్న బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వాకు మధ్యప్రదేశ్ గోండు పెయింటింగ్‌ను అందజేసి భారత దేశ కళ, సంప్రదాయాల గొప్పదనాన్ని వివరించారు. కాగా, బ్రిక్స్ సదస్సు కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లిన మోదీ అక్కడ పర్యటనను ముగించుకొని శుక్రవారమే గ్రీస్ వెళ్లారు.
భారత ప్రధాని గ్రీస్‌లో పర్యటించడం నలభై ఏళ్లలో ఇదే తొలిసారి. చివరిగా ఇందిరాగాంధీ 1983లో గ్రీస్ వెళ్లారు. గ్రీస్ రాజధాని ఏథెన్స్‌లో మోదీకి సంప్రదాయ స్వాగతం లభించింది. గ్రీస్ పర్యటనలో భాగంగా మోదీ ఆ దేశ ప్రధాని కిరియాకోస్ మిత్సొటకీ్‌సతో భేటీ అయ్యారు. 2030 నాటికి వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని.. ఆయా రంగాల్లో మేధో వలసలకు ప్రోత్సాహం అందించేలా ఒప్పందం కుదుర్చుకునేందుకు అంగీకారానికి వచ్చారు. మోదీ శనివారం రాత్రే మోదీ గ్రీస్ నుంచి ఇండియాకు బయల్దేరారు.
చంద్రయాన్-3 విజయం.. యావత్ మానవాళిది అని గ్రీస్ అధ్యక్షుడు సకెల్లారౌపౌలోతో మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మైత్రిని బలోపేతం చేసేలా తమ మధ్య చర్చలు జరిగాయని ట్వీట్ చేశారు. కాగా, మోదీ గౌరవార్థం గ్రీస్ గారండ్ క్రాస్‌ను సకెల్లారౌపౌలో బహూకరించారు. గ్రీస్ నాయకులు కాకుండా.. దీనిని అందుకున్న తొలి విదేశీ నేత మోదీనే కావడం విశేషం.